అమెరికాలో ఘోర ప్రమాదం... ఏపీ విద్యార్థిని దుర్మరణం... ఉద్యోగంలో చేరబోతున్న సమయంలోనే...

అమెరికాలో ఘోర ప్రమాదం... ఏపీ విద్యార్థిని దుర్మరణం... ఉద్యోగంలో చేరబోతున్న సమయంలోనే...

అమెరికాలో ఉన్నత చదువులు చదువుతూ బంగారు భవిష్యత్తు వెతుక్కునే క్రమంలో ఒక తెలుగు విద్యార్థిని ఘోర రోడ్డు ప్రమాదానికి బలయ్యింది.ఏపీకి చెందిన ప్రసన్న అట్లూరి న్యూయార్క్ లో జరిగిన కార్ యాక్సిడెంట్ లో మృతి చెందింది. ప్రసన్న మరణవార్తతో ఆమె కుటుంబ సభ్యులు బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రసన్న వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు అతివేగంతో వచ్చి ఢీకొన్నట్లు సమాచారం. అవతలి కారు డ్రైవర్ సిగ్నల్ జంప్ చేసి రావడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రసన్న అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఉద్యోగంలో చేరబోతున్న సమయంలోనే...

ప్రసన్న అమెరికాలో పేస్ యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంది. మాస్టర్స్ పూర్తయ్యాక మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చిందని.. త్వరలోనే జాబ్ లో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు ప్రసన్న స్నేహితులు.

ఎన్నో ఆశలతో అమెరికా పంపిన కుమార్తె, కెరీర్‌లో స్థిరపడుతున్న సమయంలో ఇలా విగతజీవిగా మారిందనే వార్తను ఆమె తల్లిదండ్రులు  జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రసన్న మృతి పట్ల అమెరికాలోని ప్రవాస తెలుగు సమాజం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న ప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వదేశానికి తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి.

చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రసన్న మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.