తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు.. అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ రాష్ట్రాల జాబితాలో చోటు

తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు.. అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ రాష్ట్రాల జాబితాలో చోటు

భారత్ మొత్తం ఇప్పటికీ ప్రపంచ బ్యాంక్ వర్గీకరణ ప్రకారం లోయర్ మిడిల్ ఇన్‌కమ్ దేశంగానే కొనసాగుతోంది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పటికే అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ స్థాయికి చేరుకోవడం విశేషం. రాష్ట్రాల వారీగా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే దేశంలో అభివృద్ధి ఒకేలా లేదని, కొన్ని రాష్ట్రాలు ప్రపంచ స్థాయి ఆదాయ ప్రమాణాలను అందుకుంటుండగా మరికొన్ని ఇంకా వెనుకబడే ఉన్నాయని తాజా విశ్లేషణ బయటపెట్టింది.

ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం తలసరి ఆదాయం 4,636 డాలర్లకు పైగా ఉంటే ఆ దేశం లేదా ఆ ప్రాంతం అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ప్రమాణాన్ని భారత్‌లో 5 రాష్ట్రాలు అధిగమించాయి. దేశ రాజధాని ఢిల్లీ తలసరి ఆదాయం 6,217 డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కర్ణాటకలో 5,579 డాలర్లు, తెలంగాణలో 5,407 డాలర్లు, తమిళనాడులో 5,329 డాలర్లు, గుజరాత్ లో4,734 డాలర్లు వరుసగా నిలిచాయి. ఈ 5 రాష్ట్రాలు ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ స్థాయిని దాటాయి.

మరోవైపు మహారాష్ట్ర, హర్యానా, కేరళ రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో చేరడానికి చాలా దగ్గరగా వచ్చాయి. మహారాష్ట్ర తలసరి ఆదాయం 4,628 డాలర్లు కాగా, హర్యానా 4,627 డాలర్లు, కేరళ 4,610 డాలర్లతో స్వల్ప తేడాతో అవకాశాన్ని కోల్పోయాయి.

అయితే దేశంలో అభివృద్ధి అందరికీ సమానంగా జరగడం లేదనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. బీహార్ ఇంకా దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఉంది. అక్కడ తలసరి ఆదాయం కేవలం 984 డాలర్లు మాత్రమే. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 1,403 డాలర్లు, జార్ఖండ్ 1,470 డాలర్లుగా ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల ఆదాయం నేపాల్‌తో పాటు కొన్ని ఆఫ్రికా దేశాల కంటే కూడా తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

గత 3 దశాబ్దాల్లో రాష్ట్రాల అభివృద్ధిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఆదాయ పరంగా అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ ప్రస్తుతం రాజస్థాన్ స్థాయికి చేరగా.. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల కంటే ఎక్కువ తలసరి ఆదాయాన్ని నమోదు చేశాయి. ఒడిశా, అసోం వంటి రాష్ట్రాలు కూడా ఆదాయం విషయంలో గతంతో పోలిస్తే వేగంగా అభివృద్ధిని సాధించాయి.

అయితే రాష్ట్రాల మధ్య ఆదాయ అసమానతలు కూడా పెరుగుతున్నాయి. సంపన్న రాష్ట్రాలు మరింత వేగంగా ఎదుగుతుండగా.. వెనుకబడిన రాష్ట్రాలు ఇంకా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో భారత్ మొత్తం ఆర్థికంగా ముందుకు సాగుతున్నప్పటికీ, రాష్ట్రాల మధ్య అభివృద్ధి అంతరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసమానతలను తగ్గించడమే రాబోయే కాలంలో దేశ ఆర్థిక విధానాల ముందున్న అతిపెద్ద సవాల్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.