వలస కార్మికుల నివాస ప్రాంతాలకు అంగన్వాడి సేవలు అందించే లక్ష్యంతో మొబైల్ అంగన్వాడి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది మహిళ, శిశుసంక్షేమశాఖ. అందులో భాగంగా మొబైల్ అంగన్ వాడి వాహానాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం (జులై 07) ప్రారంభించారు . కార్మిక శాఖ సౌజన్యంతో రూపొందించిన మొబైల్ అంగన్వాడి కేంద్రాలు వలస కర్మికులు ఉండే ప్రాంతాల్లో సేవలు అందించనున్నాయి.
హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడారు మంత్రి సీతక్క. అంగన్వాడి కేంద్రాలు లేనిచోట ఈ మొబైల్ అంగన్వాడి కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా వలస కార్మికుల కుటుంబాలకు ఈ మొబైల్ అంగన్వాడి కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు.
అంగన్వాడి కేంద్రాల్లో లభించే అన్ని సేవలు మొబైల్ అంగన్వాడి కేంద్రాల్లో అందుతాయని తెలిపారు. పనుల కోసం హైదరాబాద్ కు వచ్చే కార్మికుల పిల్లల కోసం వీటిని ఏర్పాటు చేశామన్నారు. పోషకాహారము, ఆరోగ్యం సంరక్షణ, ప్రీస్కూల్ విద్య మొబైల్ అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తామని చెప్పారు.
ఒక్కో మొబైల్ అంగన్వాడి వాహనం సుమారు 10 సెంటర్లకు సమానంగా సేవలు అందిస్తోందని తెలిపారు. ఒక్కో మొబైల్ అంగన్వాడి సెంటర్ 300 మంది లబ్ధిదారులకు సేవలందిస్తుందన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్:
మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి...మొబైల్ అంగన్వాడీ కేంద్రం మంచి ఆలోచన అని అన్నారు. వలస కార్మికుల పిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అభినందించారు.
రానున్న రోజుల్లో అంగన్వాడీ మొబైల్ కేంద్రాలను మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
