దాదాపు నాలుగేళ్లుగా వివాదాల్లో చిక్కుకున్న దిల్‌జిత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' చివరకు ఎలాంటి హంగామా లేకుండా ZEE5లో విడుదలైంది. అయితే విడుదలైన 48 గంటలు కూడా పూర్తికాకముందే ఈ చిత్రాన్ని ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించారు. దీంతో మరోసారి ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది.
అభ్యంతరం ఎందుకో చెప్పిండి..
ఓటీటీలోకి వచ్చిన 48 గంటల్లోనే ఈ చిత్రాన్ని నిలిపివేయడంపై ఈ మూవీకి దర్శకుడు హనీ త్రేహన్, కథా రచయిత నిరేన్ భట్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలో అసలు అభ్యంతరకరమైన విషయం ఏమిటో ఇప్పటికీ ఎవరూ చెప్పలేదు. సమస్య ఉంటే చర్చించండి . కానీ ఎలాంటి వివరణ లేకుండా సినిమాయను ఆపేయడం సరైంది కాదని మండిపడ్డారు. ZEE5 ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సినిమా అందుబాటులో ఉండదు అని మాత్రమే ప్రకటించగా, సహ నిర్మాత RSVP మూవీస్ అధికార ప్రతినిధి మాత్రం ప్రభుత్వం ఆదేశాల మేరకే చిత్రాన్ని తొలగించారు అని వెల్లడించారు.
అసలు వివాదం ఎందుకు? కథేంటి?
పంజాబ్‌లో 1984 నుండి 1994 మధ్య కాలంలో జరిగిన తీవ్రవాద అణచివేత నేపథ్యంలో... వేలాది మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని బట్టబయలు చేసిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ హనీ ట్రెహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గుర్తుతెలియని మృతదేహాల దహనాలు, ఎన్‌కౌంటర్లపై ఖల్రా చేసిన పరిశోధనను ఇందులో చూపించారు. కాగా, 1995లో ఖల్రా కూడా మిస్టీరియస్‌గా అదృశ్యమయ్యారు . ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు తేలింది. పంజాబ్ హిస్టరీలోనే అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన ఈ రియల్ స్టోరీని టచ్ చేయడమే ఈ సినిమా చుట్టూ ఇంత రచ్చ జరగడానికి కారణం.
ప్రభుత్వ వాదన ఇదే..
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 2022లో CBFCకు పంపగా ఏకంగా 127 కట్స్ సూచించారని తెలుస్తోంది. చిత్రబృందం వాటిని అంగీకరించకపోవడంతో సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత టైటిల్‌ను 'పంజాబ్ 95' నుంచి 'సత్లుజ్'గా మార్చి నేరుగా OTTలో విడుదల చేశారు. అయితే థియేటర్లలో విడుదలకు అవసరమైన సెన్సార్ సర్టిఫికేట్ లేకపోవడం, అలాగే భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మధ్యవర్తి మార్గదర్శకాల ప్రకారం ZEE5కు సినిమాను తొలగించాలని సూచించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
►ALSO READ | RGV on Satluj: ‘సత్లుజ్’ను ఎన్‌కౌంటర్ చేయొద్దు.. దిల్జీత్ సినిమా వివాదంలోకి ఆర్జీవీ ఎంట్రీ.. ఒక్క ట్వీట్‌తో కలకలం..
మా సినిమానే లక్ష్యంగా ఎందుకు?
అయితే నిరేన్ భట్ ఈ వాదనను తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ సినిమా కాదు.. న్యాయం కోసం పోరాడిన ఓ సాధారణ వ్యక్తి కథ. 'ది కశ్మీర్ ఫైల్స్', 'ది కేరళ స్టోరీ' వంటి సినిమాలు విడుదలవుతాయి. మరి మా సినిమానే ఎందుకు లక్ష్యంగా మారింది? అని ప్రశ్నించారు. దర్శకుడు హనీ త్రేహన్ కూడా నాలుగేళ్లుగా అసలు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తెలియలేదని, చివరికి సెన్సార్ బోర్డుతో సంభాషణే పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు.
అటు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దిల్‌జిత్ దోసాంజ్ కూడా స్పందించారు. ఈ సినిమా తొలగించే అవకాశం ముందే ఊహించామని, అందుకే ఎలాంటి ప్రకటనలు లేకుండా సర్‌ప్రైజ్‌గా విడుదల చేశామని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. గతంలో 'ఉడ్తా పంజాబ్' విషయంలో న్యాయస్థానం జోక్యంతో సినిమా విడుదలైనట్లే.. 'సత్లుజ్ 'కూడా త్వరలో తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమా తొలగించిన కొద్ది గంటల్లోనే పైరేటెడ్ కాపీలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడం మరో ఆసక్తికర పరిణామంగా మారింది.
