- హైదరాబాద్ సమిట్ వేదికగా విదేశీ ప్రతినిధులకు ఆత్మీయ విందు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అత్యంత సురక్షితమైన రాష్ట్రమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ నోవాటెల్‌లో మంగళ, బుధవారాల్లో 'గ్రీన్ గ్రోత్ ఎనర్జీ సమ్మిట్-2026' జరగనుంది. ఈ సదస్సు కోసం వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సోమవారం రాత్రి డిప్యూటీ సీఎం భట్టి స్వాగతం పలికారు.
వారి కోసం ప్రత్యేకంగా ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నగరంలో విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులకు ఎలాంటి కొరత లేదని చెప్పారు. కొత్త పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు హైదరాబాద్ ఒక స్వర్గధామం లాంటిదని వివరించారు.
రాష్ట్రంలో అద్భుతమైన ప్రతిభ కలిగిన యువత ఉన్నారని భట్టి వివరించారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, సాంకేతిక రంగాలలో నైపుణ్యం ఉన్న యువత పెట్టుబడిదారులకు ఒక గొప్ప ఆస్తి లాంటివారన్నారు. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలన్నీ ఇప్పుడు హైదరాబాద్‌ను తమ గ్లోబల్ సెంటర్లకు, డేటా సెంటర్లకు ప్రధాన వేదికగా ఎంచుకుంటున్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఆత్మీయతకు, అతిథి మర్యాదలకు నిలయమన్నారు.
వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించడం తమ సంప్రదాయమని అభివర్ణించారు. ఈ విందు కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
