ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అమ్మకాలతో లక్షలాది మంది వాహనదారుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. సాధారణ పెట్రోల్ స్థానంలో ఇప్పుడు 20 శాతం ఇథనాల్ కలిగిన E20 మాత్రమే ఉండటంతో.. ముఖ్యంగా పాత కార్లు, బైక్‌ల యజమానులు తమ వాహనాల పనితీరు, మైలేజ్, ఇంజిన్ జీవితకాలంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) నిర్వహించిన పరీక్షల్లో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదికను ప్రభుత్వం, ఆటోమొబైల్ కంపెనీలు మార్గదర్శకంగా ఉపయోగిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ప్రజలకు అధికారికంగా విడుదల చేయలేదు.
రబ్బర్ భాగాలపై ప్రభావం..
ARAI పరీక్షల ప్రకారం.. E10 పెట్రోల్‌కు అనుగుణంగా తయారైన పాత వాహనాల్లో ఇప్పుడు అమ్ముతున్న E20 వాడితే ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉండే రబ్బర్ హోసులు, గ్యాస్కెట్లు, సీల్స్, O-రింగ్స్ వంటి భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని తేలింది. అయితే మెటల్ భాగాలపై మాత్రం ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని రిపోర్ట్ పేర్కొంది. ఇథనాల్ తేమను ఎక్కువగా గ్రహించే స్వభావం కలిగి ఉండటంతో.. పాత వాహనాల్లో తుప్పు, మెటీరియల్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.
కార్ల పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు.. బైక్‌లకు ఊరట
నాలుగు చక్రాల వాహనాలపై నిర్వహించిన పరీక్షల్లో ఒక BS-IV ఇంజిన్ E20 పెట్రోల్ వాడకంతో పనితీరు దెబ్బతింది. అయితే BS-VI టర్బో ఇంజిన్‌లో 265 గంటల పరీక్షల తర్వాత సమస్యలు మెుదలయ్యాయి. మరో రెండు కార్ల తయారీ సంస్థల పరీక్షల్లో ఒక కంపెనీ 400 గంటల పరీక్షల తర్వాత ఎలాంటి సమస్యలు గుర్తించకపోగా.. మరో కంపెనీ 809 గంటల తర్వాత ఎగ్జాస్ట్ వాల్వ్‌లో థర్మోమెకానికల్ ఫెయిల్యూర్ జరిగింది. అయితే దీనికి E20 మాత్రమే కారణమని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇంజిన్ డ్యూరబిలిటీ పరీక్షలు సుమారు 2వేల గంటల వరకు కొనసాగుతాయని వారు గుర్తుచేస్తున్నారు. మరోవైపు మూడు ద్విచక్ర వాహన తయారీ సంస్థలు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడం బైకర్లకు కొంత ఊరటనిస్తోంది.
►ALSO READ | మరోసారి కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్స్.. AI బబుల్ పగులుతోందా..?
మైలేజ్ తగ్గుదల నిజమేనా?
E20 పెట్రోల్ వాడకంతో వాహనంలో ఇంధన వినియోగం 2 నుంచి 6 శాతం వరకు పెరగొచ్చు. అంటే ఒకే దూరం ప్రయాణించడానికి కొంచెం ఎక్కువ పెట్రోల్ అవసరం అవుతోంది సాధారణ పెట్రోల్ కంటే. దీనికి ప్రధాన కారణం ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే శక్తి విలువ తక్కువగా ఉండటమే. అయితే ఈ ప్రభావం ప్రతి వాహనంలో ఒకేలా ఉండదని.. ఇంజిన్ డిజైన్, వాహనం వయస్సు, తయారీ ప్రమాణాలపై ఆధారపడి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. స్టార్టింగ్, డ్రైవబిలిటీ, టెయిల్‌పైప్ ఉద్గారాల విషయంలో మాత్రం పరీక్షల్లో ఎలాంటి అసాధారణ సమస్యలు కనిపించలేదని నివేదిక స్పష్టం చేసింది.
మరి ఆటో కంపెనీలు ఏమంటున్నాయి?
వాహనదారుల ఆందోళనల మధ్య ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మాత్రం E20 పూర్తిగా సురక్షితమేనని చెబుతున్నాయి. మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్, హ్యుందాయ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ప్రయోగశాల పరీక్షలు, కోట్లాది వాహనాల సర్వీస్ డేటా ఆధారంగా E20 వల్ల అసాధారణ తుప్పు, అధిక వేర్ అండ్ టియర్, ఇంజిన్ లైఫ్ తగ్గినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించాయి. ముఖ్యంగా మారుతి సుజుకి 2కోట్ల 84లక్షలకు పైగా వాహనాల సర్వీస్ రికార్డులను విశ్లేషించినప్పటికీ E20 కారణంగా ప్రత్యేక సమస్యలు గుర్తించలేదని చెప్పింది.
E20 తర్వాత E25, E30.. మరింత పెరుగుతున్న ఆందోళనలు
భారత్ ఇప్పటికే E20 లక్ష్యాన్ని 2030 కంటే ఐదేళ్ల ముందే పూర్తి చేసింది. ఇప్పుడు ప్రభుత్వం E22, E25, E27, E30 వంటి అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తుండటంతో వాహనదారుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి. E20 తర్వాత మరింత అధిక ఇథనాల్ కలిగిన ఇంధనం తప్పనిసరి అవుతుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం పెట్రోలియం దిగుమతులు తగ్గించడం, విదేశీ మారక నిల్వలను ఆదా చేయడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే కొత్త తరం వాహనాలు E20కు పెద్దగా ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉన్నప్పటికీ.. 2012కు ముందు తయారైన లేదా E0/E10 ప్రమాణాల కోసం రూపొందించిన పాత వాహనాల యజమానులు వాహనాల నిర్వహణ, సర్వీసింగ్‌పై మరింత శ్రద్ధ అవసరం. సో ఇప్పుడు కొత్తగా ఈ20 సపోర్ట్ చేసే వాహనాలు కొన్నా రానున్న కొద్ది సంవత్సరాల్లో అవి కూడా అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంతో అచ్చం ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.
