ప్రపంచ టెక్ రంగంలో మరోసారి భారీ లేఆఫ్స్ కలకలం రేపుతున్నాయి. ఏఐ అడాప్షన్ వేగం పుంజుకోవడంతో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరో భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ముఖ్యంగా కంపెనీకి చెందిన గేమింగ్ విభాగం Xbox అత్యంత తీవ్ర ప్రభావానికి గురికానుండగా.. వచ్చే ఏడాదిలో మొత్తం 3వేల 200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడైంది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీనివల్ల కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 20 శాతం మంది ప్రభావితం అవుతారని తెలుస్తోంది.
కంపెనీ సీఈఓ ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన లేఖలో సంస్థ ప్రస్తుతం ఆర్థికంగా ఆరోగ్యకరమైన స్థితిలో లేదని ఒప్పుకున్నారు. గత ఏడాది పెట్టుబడి పెట్టిన ప్రతి డాలర్‌కు కంపెనీకి 64 సెంట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. దీంతో సంస్థను లాభల మార్గంలోకి తీసుకురావడానికి కఠిన నిర్ణయాలు తప్పడం లేదని పేర్కొన్నారు. తొలి విడతలో 1,600 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోనుండగా.. మిగిలిన లేఆఫ్స్ 2027 ఆర్థిక సంవత్సరంలో పూర్తికానున్నాయి. ఇదే సమయంలో 4 గేమింగ్ స్టూడియోలను విక్రయించడంతో పాటు మరో స్టూడియోను వేరు చేసే ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం గేమింగ్ పరిశ్రమ తీవ్రమైన హార్డ్‌వేర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆశా శర్మ పేర్కొన్నారు. ఇతర ప్లాట్‌ఫారమ్ కంపెనీలతో పోలిస్తే Xbox లాభాల మార్జిన్ 3 నుంచి 10 రెట్లు తక్కువగా ఉందని.. అందుకే సంస్థను పూర్తిగా రీసెట్ చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఉద్యోగుల ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని, కానీ సంస్థ భవిష్యత్‌ను కాపాడేందుకు ఈ నిర్ణయాలు అనివార్యమయ్యాయని వివరించారు.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంస్థలో ఉన్న మేనేజ్‌మెంట్ స్థాయిలను 14 నుంచి 5కు, సాధ్యమైన చోట మూడుకు తగ్గించనున్నారు. దీంతో నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. అలాగే బయటి వెండర్లపై చేసే వ్యయాన్ని 50 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించింది. మరోవైపు Mojang, King స్టూడియోలను నేరుగా సీఈఓ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. సంస్థ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా హెలెన్ చియాంగ్‌ను నియమిస్తూ అన్ని విభాగాలను ఒకే ఆపరేటింగ్ మోడల్ కింద నడిపించాలని నిర్ణయించారు. భారీ లేఆఫ్స్ ప్రకటించినప్పటికీ.. ఏఐ ఆధారిత భవిష్యత్ వృద్ధిపై పూర్తి దృష్టి పెట్టి Xboxను మరింత బలమైన సంస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.
