జ్యోతినగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో ఐదు యూనిట్లను షట్ డౌన్ చేశారు. విద్యుత్ డిమాండ్ తగ్గడం, సోలార్ పవర్ మరియు ఇతర ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో డిమాండ్ లేక ఉత్పత్తిని నిలిపివేశారు. 200 మెగావాట్ల సామర్థ్యం గల 1, 3 యూనిట్లతో పాటు 500 మెగావాట్ల సామర్థ్యం గల 5, 6, 7 యూనిట్లను క్లోజ్ చేశారు.
ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం 4,200 మెగావాట్లు కాగా ప్రస్తుతం 1,145 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. ఐదు యూనిట్లను షట్ డౌన్ చేయడంతో సుమారు 3,055 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 800 మెగావాట్ల యూనిట్‌లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది.
