300 ఎకరాలు పంచిన నేత.. సొంత ఇల్లు లేకుండానే కన్నుమూత.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రస్థానం !

300 ఎకరాలు పంచిన నేత.. సొంత ఇల్లు లేకుండానే కన్నుమూత.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రస్థానం !

పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. అని కాళోజీ చెప్పిన కవితా పంక్తులకు నిలువెత్తు నిదర్శనం ఈ మహానేత. 300 ఎకరాల భూమని ప్రజలకు రాసిచ్చి.. సొంత ఇల్లు కూడా లేకుండా బతికిన మహామనిషి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. అద్దె ఇంట్లో ఉంటూ.. సాధారణ చెతక్ బండిపైనే తిరిగిన అతి సామాన్యుడు.. భూదాన్ రెడ్డిగా పేరొందిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూశారు. మంగళవారం (జులై 07) హైదరాబాద్ లో ఆయన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు.

ప్రస్థానం:

 యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో 1943 సెప్టెంబర్ 10న సంపన్న కుటుంబంలో  జన్మించిన నర్సింహారెడ్డి.. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ జీవితం గడిపారు. తండ్రి రామచంద్రారెడ్డి  పోలీస్ పటేల్. రెండు అంతస్తుల ఇల్లు, పన్నెండు మంది జీతగాళ్లు, ఎనిమిది గుర్రాలు, రెండు వందల ఆవులు, వందల మేకలు, గొర్రెలు ఉండేవి. అంత గొప్ప కుటుంబంలో పుట్టినా.. ఉన్నదంతా పేదలకు పంచి.. చివరి రోజుల్లో అద్దె ఇంట్లో గడపాల్సి వచ్చిందంటే ఆయన త్యాగనిరతి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

1962 - 1970 వరకు  ఎనిమిది సంవత్సరాలు బ్రాహ్మణపల్లి సర్పంచ్ గా పనిచేశారు.  1969 తొలిదశ తెలంగాణ ఉద్యమ  సమయంలో సర్పంచ్‌గా..  తెలంగాణ పోరాట సమితి భువనగిరి తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.

 1978 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  1983ఎన్నికలలో ఎన్టీ రామారావు ప్రభంజనం రాష్ట్రమంతా  ప్రభావం చూపినప్పటికీ, భువనగిరి నియోజకవర్గం నుండి రెండవసారి కాంగ్రెస్ పార్టీ నుండే శాసనసభ్యుడుగా  విజయం సాధించి చరిత్ర సృష్టించారు.

అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పదవిలో ఉన్నప్పుడే కూడబెట్టుకుని.. ఎంత ఖర్చచేసి అయినా గెలిచే నాయకులున్న రోజుల్లో.. ఎన్నికల ఖర్చు భరించలేని స్థితిలో స్వచ్ఛందంగా తప్పుకున్న నేత ఎవరైనా ఉన్నారా అంటే అది కొమ్మిడి నర్సింహారెడ్డి అని చెప్పవచ్చు. 1985 మధ్యంతర ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు భరించలేని ఆర్థిక పరిస్థితిలో తప్పుకున్నారు.  

బతుకంతా పోరాటమే..

భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు  సాగు నీరు అందించాలని  ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బ్యారేజీ నిర్మాణం కోసం అలుపెరుగని పోరాటాలు  చేసిన ఘనత  నరసింహారెడ్డికి  దక్కుతుంది.  
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని  మూసీ పరీవాహక ప్రాంతంలో కాలుష్యం నివారణ కోసం  శక్తి  వంచన లేకుండా పోరాటం చేశారు.

2013లో  బీబీనగర్ నిమ్స్ ఏర్పాటు కోసం  అప్పటి ప్రభుత్వం బీబీనగర్‌లోని 161 ఎకరాల స్థలాన్ని సేకరించింది. 2004లో శంకుస్థాపన చేసి, కొన్ని భవనాలు నిర్మించింది .  యంత్రాలు, సిబ్బంది లేకుండా భూత్ బంగ్లాగా మారినందుకు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

 బ్రాహ్మణపల్లిలో తన వాటా కిందికి వచ్చిన భూమిలో 300 ఎకరాల సాగు భూమిని పేద ప్రజలకు  పంచారు. అందులో కొన్ని ఎకరాలు దళితులకు ఇచ్చి ఓ కాలనీ  ఏర్పాటు చేయించారు.  సీలింగ్ చట్టం  ప్రకారం  80 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేశారు.  ప్రజలు నరసింహారెడ్డిని భూదాన్ రెడ్డి అని ప్రేమగా అభిమానంగా పిలుచుకుంటారు.

ALSO READ : భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూత

గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్ళించడం ద్వారా లక్ష ఎకరాలను ఏ విధంగా  సశ్యశ్యామలం చేయవచ్చో   ఒక బ్లూప్రింట్ తయారు చేశారు. ఒక పెద్ద ఫ్లెక్సీపై ప్రింట్ చేయించి, దాన్ని గచ్చుమీద పరచి, ఒక ఉపాధ్యాయుడిలా వివరించి ఒప్పించారు. 

అద్దె ఇల్లు.. బజాజ్ చేతక్:

వారసత్వంగా వందల ఎకరాల భూమి వచ్చినా.. 300 ఎకరాలు పేదలకు పంచి భూదాన్ రెడ్డిగా పేరొందారు నర్సింహారెడ్డి.  ఉన్న భూమి అంతా ప్రజలకు పంచగా.. మిగిలిన కొంత భూమిని అమ్మేసి పిల్లలను చదివించారు. మిగిలిన భూమి బొల్లేపల్లి కాలువ తవ్వకాల్లో పోయింది. కానీ పరిహారం రాలేదు.  పరిహారం వస్తే  అద్దె ఇల్లు వదిలిపెట్టి సొంత  ఇల్లు కట్టుకోవడం కోసం సీఎం, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా పరిహారం అందలేదు.

 భార్య సుకన్యమ్మ  రెండేళ్ల క్రితం చనిపోయింది. ఇద్దరు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. చివరి రోజుల్లో కూతురు దగ్గరే హైదరాబాద్ లో గడిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సొంత వాహనం లేదు.. సొంత ఇల్లు లేదు. సాధారణ బజాజ్ చేతక్ స్కూటర్ పైనే తిరిగారు. 

ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే తరతరాలకు తరగని ఆస్తులు కూడబెట్టుకునే నాయకులునున్న ఈ రోజుల్లో.. ఉన్నదంతా ప్రజలకు పంచి సాధారణ జీవితం గడిపిన కొమ్మిడి నరసింహా రెడ్డి జీవితం ఆదర్శనీయం. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ( జులై 08) ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.