భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూత

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూత

యాదాద్రి భువనగిరి జిల్లా : భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లో కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

1943 సెప్టెంబర్ 10న బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో కొమ్మిడి నరసింహారెడ్డి జన్మించారు. 1962 నుంచి 1970 వరకు బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోరాట సమితి భువనగిరి తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున భువనగిరి ఎమ్మెల్యేగా తొలి విజయం సాధించారు. 

1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందులతో స్వచ్ఛందంగా పోటీకి దూరంగా ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సొంత ఇల్లు, సొంత కారు లేని ప్రజా నాయకుడు కొమ్మిడి నరసింహారెడ్డి కావడం విశేషం. సాధారణ బజాజ్ చేతక్ స్కూటర్‌పైనే ప్రజల మధ్య తిరిగిన ప్రజానేత, తన వాటా భూమిలో 300 ఎకరాల సాగుభూమిని పేదలకు పంచిన భూదాన యోధుడు. దళితులకు భూములు ఇచ్చి ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేశారు. సీలింగ్ చట్టం ప్రకారం 80 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు.  ప్రజల ప్రేమతో "భూదాన్ రెడ్డి"గా గుర్తింపు పొందారు.

  • భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగునీరు కోసం ఇచ్చంపల్లి బ్యారేజీ ఉద్యమం
  • గోదావరి జలాలను మూసీకి మళ్లించే ప్రణాళికపై నిరంతర ప్రచారం
  • లక్ష ఎకరాలను సస్యశ్యామలం చేసే బ్లూప్రింట్ రూపొందించిన దూరదృష్టి నాయకుడు
  • మూసీ నది కాలుష్య నిర్మూలన కోసం జీవితాంతం పోరాటం
  • బీబీనగర్ నిమ్స్ ఏర్పాటు కోసం 2013లో ఆమరణ నిరాహార దీక్ష
  • ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాట యోధుడిగా గుర్తింపు
  • మిగిలిన భూమిని విక్రయించి పిల్లలకు ఉన్నత విద్య
  • బొల్లేపల్లి కాలువలో భూమి కోల్పోయినా పరిహారం కోసం చివరి వరకు పోరాటం
  • భార్య సుకన్యమ్మ రెండేళ్ల క్రితం మృతి
  • ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కుటుంబ సభ్యులు
  • నిరాడంబర జీవనం, నిష్కల్మష రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన కొమ్మిడి నరసింహారెడ్డి
  • భువనగిరి రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రజానాయకుడు