- తదుపరి విచారణ 29కి వాయిదా
హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. వీడియో లింకేజి ద్వారా ముంబై నుంచి వర్చువల్‌గా అటెండ్ అయ్యారు. ముంబైలో సినిమా షూటింగ్ లో ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో మరికొందరు నిందితులు విచారణకు గైర్హాజరు కావడంతో వారి తరుపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు.
నిందితుల వ్యక్తిగత హాజరులో భాగంగా తదుపరి విచారణ జులై 29 కి వాయిదా పడింది. 2024 డిసెంబర్ 4న పుష్పచిత్ర ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
