మరోసారి కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్స్.. AI బబుల్ పగులుతోందా..?

మరోసారి కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్స్.. AI బబుల్ పగులుతోందా..?

AI రంగంలో నెలకొన్న అనిశ్చితి ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. ముఖ్యంగా టెక్నాలజీ, చిప్ తయారీ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలతో సౌత్ కొరియా మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పెట్టుబడిదారులు AI సంబంధిత కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దక్షిణ కొరియా నుంచి జపాన్, హాంకాంగ్ వరకు ప్రధాన మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. AI రంగంలో పెట్టుబడులు భవిష్యత్తులో ఆశించిన స్థాయిలో లాభాలను అందిస్తాయా అనే సందేహాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

ఈ ప్రభావం అత్యధికంగా దక్షిణ కొరియా మార్కెట్‌పై కనిపించింది. అక్కడి బెంచ్‌మార్క్ సూచీ కోస్పీ ఏకంగా 8 శాతానికి పైగా క్షీణించి భారీ నష్టాలను చవిచూసింది. దీనికి ముందు కూడా కొన్ని రోజుల కిందట ఇలాంటి పరిస్థితే 2 సార్లు అక్కడ నమోదైంది. చిప్ తయారీ సంస్థలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌కే హైనిక్స్ షేర్లు వరుసగా 9.3 శాతం, 9.5 శాతం మేర పతనమయ్యాయి. శాంసంగ్ ఇటీవల భారీ లాభాలను ప్రకటించినప్పటికీ పెట్టుబడిదారుల ఆందోళన తగ్గలేదు. మరోవైపు ఎస్‌కే హైనిక్స్ అమెరికాలో నాస్‌డాక్ లిస్టింగ్ కోసం 28 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతుండటంతో కూడా మార్కెట్ ఒత్తిడి కొనసాగింది.

దక్షిణ కొరియాతో పాటు జపాన్, హాంకాంగ్, చైనా, తైవాన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ సూచీ దాదాపు 1.8 శాతం పడిపోగా, టోక్యో ఎలక్ట్రాన్, కియోక్సియా హోల్డింగ్స్ వంటి టెక్ కంపెనీల షేర్లు కూడా భారీగా క్షీణించాయి. హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్, చైనా షాంఘై కాంపోజిట్, తైవాన్ తైఎక్స్ సూచీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇదే సమయంలో అమెరికా నాస్‌డాక్ ఫ్యూచర్స్ కూడా బలహీన సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ టెక్ మార్కెట్లపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ALSO READ : మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్స్..

AI రంగంపై భారీ అంచనాలతో గత కొంతకాలంగా టెక్ కంపెనీల షేర్లు ర్యాలీ చేసినప్పటికీ.. ప్రస్తుతం వాటి విలువలు వాస్తవ వ్యాపార పనితీరును మించి పెరిగాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. AI చిప్స్, డేటా సెంటర్లపై కంపెనీలు చేస్తున్న భారీ పెట్టుబడులు నిజంగా లాభదాయకంగా మారతాయా అనే ప్రశ్నలు పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయని చెప్పుకోవచ్చు. దీంతో స్వల్పకాలంలో AI సంబంధిత షేర్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.