పద్మారావునగర్, వెలుగు: 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి, పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన కోసం తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని వైఎంసీఏ హాల్‌లో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేవలం మతం మారారనే కారణంతో రిజర్వేషన్లు తొలగించడంతో దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అన్యాయానికి నిరసనగా ఆగస్టు 10ను ‘బ్లాక్ డే’గా పాటించాలని అన్ని దళిత క్రైస్తవ సంఘాలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, చర్చిలు, వివిధ క్రైస్తవ వర్గాలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే వరకు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
