యాదగిరిగుట్ట, వెలుగు: ఎర్రవల్లి ఫాం హౌస్ కు రోడ్డు వేసుకోవడం కోసం అభివృద్ధి పేరుతో వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ ఆగం చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 150 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి సోమవారం ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలో తిరిగి అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ రోడ్డు కోసం వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసిన కేసీఆర్.. వాసాలమర్రి ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామూహిక ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభానికి ఈ నెలాఖరులో వాసాలమర్రికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. ఆలేరు ఏఎంసీ చైర్ పర్సన్ చైతన్య మహేందర్ రెడ్డి, ధనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి ఉన్నారు.
