పచ్చని పొలాల మధ్య డంప్ యార్డా..?ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డ్ పెట్టడమేంటి: హరీశ్ రావు 

పచ్చని పొలాల మధ్య డంప్ యార్డా..?ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డ్ పెట్టడమేంటి: హరీశ్ రావు 

 

  • సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు:  పచ్చని పొలాల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకోవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌‌లో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామస్తులు సోమవారం హరీశ్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డంపింగ్ యార్డు వల్ల సిద్దాపూర్‌‌తోపాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల ప్రజలంతా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలానికి ఆనుకుని ఉన్న 'గుట్ట చెరువు' నీటితోనే ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు.

ఇప్పుడు ఆ చెరువు పక్కనే డంప్ యార్డు పెడితే ఆ నీరు పూర్తిగా కలుషితమై, సాగు నీటితోపాటు తాగునీటికీ తీవ్ర ముప్పు వాటిల్లుతుందన్నారు. అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గా కూడా ఇక్కడే ఉండటం, ఆ కాలుష్యం స్థానికులతోపాటు భక్తులకు కూడా శాపంగా మారుతుందని వెల్లడించారు. ఉపాధి కల్పించాల్సిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల బతుకులను చిదిమేయాలని చూడటం శోచనీయం అని అన్నారు. డంప్ యార్డులను ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలకు ఇబ్బంది కలగని చోటఏర్పాటు చేయాలని సూచించారు