కృష్ణా నదిలోకి థర్మల్ వ్యర్థాలు.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ నుంచి బూడిద నీరు

కృష్ణా నదిలోకి థర్మల్ వ్యర్థాలు.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ నుంచి బూడిద నీరు
  • కొన్ని రోజులుగా పని చేయని ట్రీట్మెంట్ ప్లాంట్
  • పీసీబీ నోటీసులు ఇచ్చినా మారని పరిస్థితి
  • మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకూ ముప్పు
  • చేపల మరణాలు, గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యర్థాలను నేరుగా కృష్ణా నదిలోకి వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా బొగ్గు మండించిన తర్వాత వెలువడే బూడిద నీరు, ఇతర వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయకుండానే సమీపంలోని అన్నమేరు వాగులోకి, అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.

కాలుష్య నియంత్రణ మండలి పలుమార్లు హెచ్చరించినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యర్థాల వల్ల నదీజలాలు మిషన్ భగీరథ తాగునీరు కలుషితం కావడంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది.

రంగు మారుతున్న నదీ జలాలు
వీర్లపాలెంలో ఉన్న యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడుతున్న బూడిద నీరు అన్నమేరు వాగు ద్వారా కృష్ణానదిలో కలుస్తుండడంతో తాళ్లవీరప్పగూడెం, ఇర్కిగూడెం, వాడపల్లి పరిసర ప్రాంతాల్లో నదీజలాలు బూడిద రంగులోకి మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ బూడిదలో ఆర్సెనిక్‌, మెర్క్యూరీ, సీసం, క్రోమియం వంటి లోహాలు, ఇతర రసాయనాల అవశేషాలు ఉండే అవకాశం ఉందని, ఇవి నీటిలో కలిస్తే పర్యావరణంతో పాటు ప్రజారోగ్యం, చేపలు, ఇతర జలచరాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట నిర్మాణం తర్వాత ఇర్కిగూడెం పుష్కరఘాట్‌ వద్ద బ్యాక్‌వాటర్‌ నిలుస్తుండడంతో బూడిద నీరు నీటి ఉపరితలంపై తెట్టులా పేరుకుపోతూ, దిగువన ఆకుపచ్చ పొరలా కనిపిస్తోంది.

నిబంధనలు గాలికి..
నిబంధనల ప్రకారం బూడిద నీటిని ప్లాంట్ లోని ట్రీట్ మెంట్ సిస్టం ద్వారా శుద్ధి చేసి తిరిగి ప్లాంట్ అవసరాలకే వినియోగించాలి. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యవస్థ నిర్వహణలో లోపాలు తలెత్తడంతో పూర్తిగా శుద్ధి కాని కాలుష్య జలాలు నేరుగా కృష్ణానదిలోకి వెళ్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వ్యర్థాలు బయటకు రాకుండా యాష్‌ పాండ్‌ను జెన్‌కో సీనియర్‌ ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నా.. బొగ్గు, యాష్‌ పాండ్‌ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన తర్వాత పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరో వైపు ప్లాంట్ నుంచి వచ్చే బూడిద నీరు కృష్ణానదిలో కలిసే ప్రాంతం వద్దే తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కాలుష్య నీరు సాగు నీటితో కలిసి వ్యవసాయ భూములపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

యాష్ పాండ్ నిర్వహణపై అనిశ్చితి
యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో బొగ్గు, యాష్‌ పాండ్‌ నిర్వహణ బాధ్యతలను బయటి సంస్థలకు అప్పగించేందుకు జెన్‌కో ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా, దీనిని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. యాష్‌పాండ్‌ నిర్వహణను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించాలని ప్రతిపాదించినప్పటికీ ఒప్పందాలు పూర్తి కాకపోవడంతో ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.

మోకాళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు..
గతంలో కృష్ణానది నీటిని నేరుగా పట్టుకొని తాగేవాళ్లమని, ఇప్పుడు ఆ నీటిని ముట్టుకోవాలన్నా భయం వేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో మోకాళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, జ్వరాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. నీటి కాలుష్యంతో చేపలు చనిపోతుండడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడి నుంచే వందలాది గ్రామాలకు మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరా అవుతున్నందున కలుషిత నీరు శుద్ధి కేంద్రాలకు చేరితే భవిష్యత్ లో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య జలాలు నదిలో కలవకుండా శాశ్వత చర్యలు తీసుకోవడంతో పాటు ఘటనకు బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే కృష్ణానదితో పాటు దానిపై ఆధారపడిన వేలాది మంది జీవనాధారం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.