ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెం.9ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద భారీ సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.
సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాలు, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల సమయంలోనే ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు.
