వానలిట్ల.. మొక్కలు నాటేదెట్ల?..వన మహోత్సవానికి ‘వర్షాభావ’ గండం!

వానలిట్ల.. మొక్కలు నాటేదెట్ల?..వన మహోత్సవానికి ‘వర్షాభావ’ గండం!
  • దీనికి తోడు ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • రాష్ట్రవ్యాప్తంగా నత్తనడకన మొక్కలు నాటే కార్యక్రమం 
  • గుర్రం గూడలో సీఎం ప్రారంభించినా.. ముందుకు సాగట్లే 
  • నర్సరీల్లో మొక్కలు రెడీగా ఉన్నా.. నాటేందుకు ఆఫీసర్ల వెనుకడుగు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవానికి ‘వాన’గండం నెలకొన్నది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడానికి తోడు చాలాచోట్ల ఇప్పటికీ గుంతలు సిద్ధం చేయకపోవడం.. తదితర కారణాలతో బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రం గూడలో అట్టహాసంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినా..  క్షేత్రస్థాయిలో మాత్రం నత్తనడకన సాగుతోంది. గతేడాది జులైతో పోలిస్తే ఈసారి వన మహోత్సవ పురోగతి దారుణంగా ఉంది.

గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో యంత్రాంగం ఉత్సాహంగా మొక్కలు నాటింది. జులై నెలాఖరు నాటికి లక్ష్యంలో దాదాపు 40  నుంచి 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ సారి ఇప్పటివరకు కేవలం 10 శాతం మొక్కలు కూడా నాటలేదు. కాగా, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

అయితే, ప్రారంభోత్సవం జరిగిన ప్రాంతం మినహా.. మిగిలిన చోట్ల ఎక్కడా ఆ సందడి కనిపించడం లేదు. గతేడాది ఇదే సమయానికి వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు యంత్రాంగం మొత్తం రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంలో నిమగ్నమై ఉండేది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 

ప్రశ్నార్థకంగా వన మహోత్సవ లక్ష్యం..

రంగారెడ్డి జిల్లా గుర్రం గూడలో సీఎం వన మహోత్సవం ప్రారంభించిన తర్వాత కొన్ని చోట్ల నామమాత్రంగా కార్యక్రమాలు జరిగాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో నాటాల్సిన మొక్కల సంఖ్య ఇంకా లక్ష్యం దిశగా సాగడం లేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ, వర్షాలు దోబూచులాడుతుండటంతో ప్లాంటేషన్ పనులు మందగించాయి. ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులతో ఇక్కడ అసలు పనులే మొదలు కాలేదు.

గుంతలు తీసి సిద్ధంగా ఉంచినా, అధికారులు మాత్రం వానల కోసం ఎదురుచూస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నా.. అధికార యంత్రాంగం రాజకీయ కార్యక్రమాలు, ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో వన మహోత్సవం వెనుకబడింది.

ఈ ఏడాది భారీగా మొక్కలు నాటాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నా.. జులై సగం కావస్తున్నా అడుగు ముందుకు పడట్లేదు. వానాకాలం ముగిశాక మొక్కలు నాటితే అవి బతకడం కష్టం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, వర్షం పడిన వెంటనే భారీ స్థాయిలో మొక్కలు నాటేలా జిల్లాల కలెక్టర్లకు, అటవీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే నర్సరీల్లో మొక్కల పెంపకానికి వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథా అవుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

నర్సరీల్లోనే ఉన్న మొక్కలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది నర్సరీల్లో సుమారు 16 కోట్ల నుంచి 18 కోట్ల మొక్కలను పెంచారు. ఇందులో నీడను ఇచ్చేవి, పండ్ల, ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. జూన్, జులై నెలల్లో ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోవడంతో, ఇప్పుడు మొక్కలు నాటితే ఎండిపోయి చనిపోతాయని ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్లతో నీళ్లు పోయడం ఆర్థికంగా భారమవుతుందని భావిస్తున్నారు. దీంతో మొక్కలు నర్సరీల్లోనే ఉండిపోతున్నాయి. సరైన సమయంలో నాటకపోతే నర్సరీల్లోనే ఎండిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.