మనకు చెడు చేసిన వ్యక్తి మన అధీనంలోకి వచ్చినపుడు వారిపై హానికరమైన లేదా ప్రతీకార చర్యలకు పూనుకోకుండా వదిలేయడాన్ని ‘క్షమాగుణం’, ‘మన్నించడం’, లేదా ‘క్షమ’ అంటాం. క్షమాగుణం ఓ శక్తిమంతమైన ఆయుధం. క్షమాగుణంతో సంతోషం, ఆరోగ్యం సిద్ధిస్తాయి.
అందువల్లనే ‘క్షమయా సాధ్యతే సర్వమ్’ అన్నారు పెద్దలు. తనపైకి రాయి విసిరిన వ్యక్తికి తియ్యనైన ఫలాలను ఇచ్చే వృక్షం, భూమాత ఓర్పు, క్షమాగుణానికి నిలువెత్తు నిదర్శనం. ‘క్షమయా ధరిత్రి’ అని వింటున్నాం. భూమాత క్షమాగుణానికి ప్రతీకగా నిలుస్తున్నది. పొరపాటు చేయడం మానవ సహజ గుణం. క్షమించడం దైవగుణం. మంచి పౌరులకు ఉండవలసిన గుణాల్లో క్షమాగుణం కూడా ప్రధానమైనది. క్షమాగుణం వల్ల క్రోధం నశిస్తుంది.
పవర్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్
మనిషికి శాంతి, మనసుకు ప్రశాంతత కావాలి. క్షమాగుణం వల్ల మానసిక ప్రశాంతత కలగడం, అనవసర ఒత్తిడి నుంచి బయటపడడం, అనవసర గొడవలు తగ్గి మానవ సంబంధాలు మెరుగుపడడం జరుగుతుంది. సమస్త జంతువుల్లో మనిషికి మాత్రమే క్షమాగుణం ఉంటుంది.
క్షమాగుణం ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రపంచ పౌర సమాజం ప్రతి ఏటా జులై 7న ‘ప్రపంచ క్షమాగుణం దినం (గ్లోబల్ ఫర్‌గివ్‌నెస్ డే) పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. క్షమాగుణం ప్రాధాన్యాలను అవగాహన పర్చడం, దాని ప్రయోజనాలను వివరించడం లాంటి అంశాలను చర్చించడానికి ఈ దినోత్సవం ఉపకరిస్తుంది. క్షమించేవారిని చేతకానివాడిగా చూస్తున్న సమాజం మనది.
కానీ, అది ఒక అసమానమైన గొప్పగుణం అని తెలుసుకోవాలి. క్షమాగుణం లేని వారిలో ఆందోళన, ఒత్తిడి, బీపీ, అసహజ భావోద్యేగాలు, ఆవేశాగ్ని, నిరాశలు పెరుగుతూ మానసిక ప్రశాంతత, జీవన సమతుల్యతలు తగ్గుతాయి. 2026 ప్రపంచ క్షమాగుణం దినోత్సవం ఇతివృత్తంగా ‘క్షమాగుణం శక్తిని తెలుసుకుందాం (పవర్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్)” అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతోంది.
క్షమాగుణం ధీరుల, జ్ఞానవంతుల లక్షణం
క్షమించడమనేది ఒక స్వయం నియంత్రణ. పశ్చాత్తాప బుద్ధి కలిగిన వాడికి క్షమాగుణం విలువ తెలుస్తుంది. నటించేవారికి క్షమాభిక్ష దుష్ఫలితాలను ఇస్తుంది. దోషికి తగిన శిక్ష విధిస్తేనే అది అతడిని నిర్దోషిగా మార్చుతుంది. ఓరిమికి పరాకాష్ట క్షమాగుణమే.
ఇది ధీరుల, జ్ఞానవంతుల లక్షణం. ఎవరు కోపగించుకున్నా తాను నిబ్బరంగా ఉంటూ, కఠినమైన మాటలు పలికినా విననట్లు జవాబు ఇవ్వకుండా, అవమానం పొందినా మనసులో పెట్టుకోకుండా ఉండడం, ఆ వ్యక్తిని క్షమించడంలాంటి లక్షణాలు క్షమించేవారికి ఉంటాయి.. ఓర్పు, క్షమ, శాంతి అనే గుణాలు జీవితాన్ని అర్థవంతంగా చేస్తాయి.
- ఆచార్య : బుర్ర మధుసూదన్ రెడ్డి
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
