దేశంలో ఇంధన రంగంలో మరో కీలక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెట్రోల్‌లో 25 శాతం ఇథనాల్(E25) వేరియంట్ తీసుకురావాలన్న ఆలోచనకు ప్రస్తుతం బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమ్ముతున్న E20 పెట్రోల్‌పై వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఆటోమొబైల్ కంపెనీల ఆందోళనలు, ఇంధన వ్యవస్థ సిద్ధత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఇప్పుడు E25 రోలౌట్ దశలవారీగా చేపట్టే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో E25పై వెంటనే నిర్ణయం కాకుండా.. మరింత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మైలేజ్ తగ్గుదల.. పాత వాహనాలపై ప్రభావం
దేశంలో E20 పెట్రోల్‌ను 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని మోడీ సర్కార్ 5 ఏళ్లు ముందుగానే హడావిడిగా పూర్తి చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20నే ప్రామాణిక ఇంధనంగా అమ్ముతోంది. అయితే E10కు అనుగుణంగా తయారైన పాత కార్లు, ద్విచక్ర వాహనాల యజమానులు మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్ పనితీరులో మార్పులు కనిపిస్తున్నాయని, ఇంధన వ్యవస్థలోని కొన్ని భాగాలు దెబ్బతింటున్నట్లు కంప్లెయింట్స్ పెరిగాయి. ఇథనాల్‌లో క్యాలరిఫిక్ వ్యాల్యూ పెట్రోల్ కంటే తక్కువగా ఉండటంతో ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇథనాల్ తేమను ఆకర్షించే స్వభావం కలిగి ఉండటంతో కొన్ని స్పేర్స్ తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది.
E25కి మరింత సంసిద్ధత అత్యవసరం..
E25 అమలుకు ముందు వాహన తయారీ సంస్థలు ఇంజిన్ కాలిబ్రేషన్, ఫ్యూయల్ సిస్టమ్ బలోపేతం, మెటీరియల్ అనుకూలత, తుప్పును అరికట్టడం వంటి అంశాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే వాహనాలకు హోమోలగేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడేందుకు అనువైన కొత్త ఇంజిన్ల అభివృద్ధి ప్రారంభించినప్పటికీ.. అవి ప్రధానంగా భవిష్యత్ మోడళ్లకే పరిమితం కానున్నాయి. పెట్రోలియం దిగుమతులను తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం లక్ష్యంగా ఇథనాల్ వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తూనే ఉన్నా.. ఇకపై వాహనదారుల ప్రయోజనాలు, పరిశ్రమ సంసిద్ధత, సైంటిఫిక్ పరీక్షలు పూర్తయ్యాకే E25 అమలు దిశగా అడుగులు వేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త కార్లు, బైక్స్ ఇప్పుడు వద్దులే..
ఏదేమైనా ఈ20 పెట్రోల్ దెబ్బకు చాలా మంది కొత్త కారు, కొత్త బైస్ కొనాలంటేనే జంకుతున్నారు. నిన్నమెున్న కొన్న కొత్త వాహనాల్లో కూడా ఇబ్బందులు రావటం.. సడెన్ గా రోడ్లపై ఆగిపోవటం చూసి బెంబేలెత్తిపోతున్నారు. కొందరు పాత వాహనాలు కొనుక్కుంటుంటే మరికొందరు ఈవీ కొనాలా లేదంటే ప్రస్తుతం కొన్నాళ్లు ఆగాలా అనే అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు కొత్త కారు, బైక్ కొన్నా అవి భవిష్యత్తులో మరింత ఇథనాల్ కలిపిన పెట్రోల్ వేరియంట్లకు సూట్ కావు కాబట్టి డబ్బులు సంతోషం రెండూ పోతాయనే ఆందోళనల మధ్య సందిగ్ధంలో తమ ప్లాన్స్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. లక్షలు ఖర్చుచేసి కష్టాలు కొనితెచ్చుకోవాలని ఎవ్వరూ కోరుకోరుగా మరి.
