భారత రాజ్యాంగంలోని 124వ అధికరణలో పేర్కొన్నట్లుగా భారత సర్వోన్నత న్యాయస్థానం దేశంలోనే అత్యున్నత న్యాయవ్యవస్థగా ఉంది. 1950 జనవరి 28న ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులతో భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభమైంది. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జె. కానియా.
సుప్రీంకోర్టులో పనిభారం పెరగడాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వాలు దఫదఫాలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాయి. ప్రస్తుతానికి 38 మంది న్యాయమూర్తులతో సర్వోన్నత న్యాయస్థానం పనిచేస్తోంది.
సుప్రీంకోర్టు భవనం న్యాయత్రాసు ఆకారాన్ని ప్రతిబింబించేలా ఇండో- యూరోపియన్ శైలిలో నిర్మితమైనది. అన్ని కోర్టు గదుల్లోకెల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు గది అతిపెద్దది. న్యాయమూర్తులు సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాలలో కూర్చుంటారు.
సభ్యుల్లో వైరుధ్యభరితమైన తీర్పులు వచ్చినప్పుడు లేదా రాజ్యాంగ సంబంధమైన ప్రశ్నలు ఉద్భవించినప్పుడు వాటిని పరిష్కరించడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ సభ్యులతో కూడిన విస్తృత, రాజ్యాంగ ధర్మాసనాల్లో కూర్చుంటారు. సుప్రీంకోర్టు సివిల్ అప్పీళ్లు, క్రిమినల్ అప్పీళ్లు, రాజ్యాంగ సంబంధిత రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లను పరిష్కరిస్తుంది. అన్ని కార్యకలాపాలు ఇంగ్లిష్‌లో నిర్వహిస్తారు. భారత సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునళ్లు కట్టుబడి ఉంటాయి.
సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆవిష్కరించిన అద్భుతమైన అందాలను, భవన నిర్మాణాన్ని దాని పూర్తి వైభవంతో ఆరాధించడానికి ప్రజలకు ప్రత్యక్ష సందర్శన ద్వారా ఒక గొప్ప అవకాశం కల్పించడమైనది. రాజ్యాంగం, చట్టాలలో నిష్ణాతులైన న్యాయవాదులు గంటల తరబడి, రోజుల తరబడి ఎక్కడైతే వాదిస్తారో, ఆ సుప్రీంకోర్టు గదులను చూడాలనే తపన సామాన్య ప్రజానీకానికి ఉండటం సహజం.
కోర్టు ప్రాంగణంలో అహింసామూర్తి అయిన మహాత్మాగాంధీ లైఫ్ సైజ్ విగ్రహాన్ని 1996లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.అహ్మదీ ఆవిష్కరించారు. 2023 సంవత్సరంలో చేతితో రాజ్యాంగాన్ని పట్టుకొన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సమక్షంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించారు.
శాస్త్రీయ పాశ్చాత్య వస్త్రాలకు బదులుగా సాంప్రదాయ చీరె, ఆభరణాలు ధరించి, కళ్లకు గంతలు లేని పునఃరూపకల్పన చేసిన న్యాయదేవత విగ్రహం 2024 సంవత్సరంలో ఆ నాటి ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు ఈ విగ్రహంలోని గొప్పదనమేమంటే చట్టం అందరినీ సమానంగా చూస్తుందని భావన కలిగేలా తెరిచిన కళ్లు, చేతిలో ఉండే సంప్రదాయ కత్తి స్థానంలో భారత రాజ్యాంగ ప్రతితో నెలకొల్పారు.
సుప్రీంకోర్టు ప్రాంగణంలో జ్యుడీషియల్ మ్యూజియం
సుప్రీంకోర్టు ప్రాంగణంలో 1980లో తల్లి ఒడిలో కూతురు తెరచిన పుస్తకంతో కూర్చున్నటువంటి ఒక కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పుస్తకం పైభాగాన ఒక త్రాసు ఉంటుంది. సమన్యాయం అందించటమే ధ్యేయం అనే భావనతో పుస్తకంపై త్రాసును చెక్కడం జరిగింది.
సుప్రీంకోర్టు ప్రాంగణంలోని జాతీయ జ్యుడీషియల్ మ్యూజియంలో భారత న్యాయవ్యవస్థ పరిణామం, ఆశోక శాసనాలు, పురాతన కళాఖండాలు, పురాతన ఫర్నీచర్, న్యాయమూర్తులు ధరించిన పురాతన అధికారిక దుస్తులు, మహాత్మా గాంధీ హత్య కేసు రికార్డుతో సహా ఇతర చారిత్రాత్మక తీర్పుల రికార్డులు భద్రపరచడమైనది.
ఈ అద్భుతాలను, జాతీయ జ్యుడీషియల్ మ్యూజియంను, వైభవోపేతమైన కోర్టు గదులను, న్యాయమూర్తుల గ్రంథాలయాన్ని ప్రత్యక్ష సందర్శన కోరుతూ సుప్రీంకో ర్టు వెబ్‌సైట్ ద్వారా గైడెడ్ టూర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా ‘సుస్వాగతం’ పోర్టల్ లేదా సుప్రీంకోర్టు ఫ్రంట్ డెస్క్ నుంచి సందర్శకుల పాస్‌ను పొందవచ్చు.
మొత్తం భవన సముదాయం గైడెడ్ టూర్ కేవలం పని దినమైన శనివారం నాడు మాత్రమే నిర్ధారించిన నాలుగు స్లాట్‌లలో గంట సమయంపాటు నిర్వహిస్తారు. ఇతర పని దినాలలో, విద్యా సంస్థల విద్యార్థులను నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం అండ్ ఆర్కైవ్ టూర్‌ను స్వయంగా సందర్శించడానికి అనుమతిస్తారు.
టూర్ గైడ్‌గా కోర్టు అధికారి
ముందుగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నట్లయితే, ప్రణాళిక చేసిన గైడెడ్ సందర్శనలు ఏర్పాటు చేస్తారు. సందర్శకులను ప్రాంగణం అంతటా తోడుగా తీసుకువెళ్లి చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను పరిచయం చేస్తారు. వారికి కోర్టు గదులను చూసే అవకాశం కూడా లభిస్తుంది. ప్రాంగణమంతా పర్యటించడానికి సాధారణంగా ఒక గంట సమయం పడుతుంది. సందర్శకులను జాతీయ న్యాయ మ్యూజియం అండ్ ఆర్కైవ్ గుండా తీసుకువెళతారు.
వారు సుప్రీంకోర్టులోని పరిపాలనా భవన సముదాయంలో ఉన్న న్యాయమూర్తుల గ్రంథాలయాన్ని కూడా చూడవచ్చు, ఇక్కడ ఇతర రోజులలో ప్రవేశం పరిమితం చేయడమైనది. కోర్టు అధికారి ఒకరిని టూర్ గైడ్‌గా నియమిస్తారు.
వారు భారతీయ న్యాయవ్యవస్థ నిర్మాణం గురించి వివరిస్తూనే, తీర్పు చెప్పిన కేసుల ఆసక్తికరమైన ఉదాహరణలు, భవన నిర్మాణ శైలి వెనుక ఉన్న చారిత్రక ప్రాముఖ్యతతో సందర్శకులను ఆసక్తిగా ఉంచుతారు. భారత సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో 'గైడెడ్ టూర్' లింక్ కింద ఉన్న ‘రిజిస్ట్రేషన్’ ట్యాబ్‌కు వెళ్లి, రిజర్వేషన్‌ను నిర్ధారించడానికి చిన్న ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించవలసి ఉంటుంది. ఈ పర్యటనకు ఎలాంటి రుసుము వసూలు చేయరు.
గైడెడ్ టూర్ సమయంలో కెమెరా, సెల్‌ఫోన్ నిషేధం
గైడెడ్ టూర్ సమయంలో ఫొటోగ్రఫీకి అనుమతి లేదు. అలాగే, ప్రాంగణంలో పర్యటించేటప్పుడు సందర్శకులు కెమెరా లేదా సెల్‌ఫోన్‌ను ఉపయోగించడం నిషేధం. తినుబండారాలు, గుట్కాలు, ధూమపానం కూడా నిషేధం.
కాకపోతే భోజనం, చిరుతిళ్లు, పానీయాలు క్యాంటీన్లో లభ్యమవుతాయి. ప్రవేశద్వారం వద్ద సందర్శకులందరికి క్షుణ్ణమైన భద్రతా తనిఖీ నిర్వహిస్తారు. సందర్శకులు మెటల్ డిటెక్టర్ల గుండా నడవవలసి ఉంటుంది. వారి వ్యక్తిగత వస్తువులు ఎక్స్-రే యంత్రం ద్వారా తనిఖీ చేస్తారు. సందర్శకులు తమ స్లాట్ సమయానికి అరగంట ముందే ఫెసిలిటేషన్ సెంటర్‌లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.
పెయింటింగ్‌లు, చిత్రపటాలు, పురాతన వస్తువులు లేదా మరే ఇతర ప్రదర్శన వస్తువుల వంటి ఏ కళాఖండాన్ని తాకడానికి అనుమతి లేదు. సందర్శకులు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ స్లిప్ ప్రింటవుట్, అసలు గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.
సందర్శకుల గ్రూప్ ఫొటో అదే రోజు సాయంత్రం ‘టూర్ ఫొటోగ్రాఫ్స్’ గ్యాలరీలో లభ్యమవుతుంది. అయితే సుప్రీంకోర్టు ఒక షరతు విధించింది. సందర్శకుల సంఖ్య ఏదేని ఒక రోజు ఐదుమందికి తక్కువగా ఉంటే గైడెడ్ టూర్ నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సందర్శన ద్వారా ప్రజలకు కొంతలో కొంతైనా కోర్టులపై అవగాహన పెరుగుతుంది. సుప్రీంకోర్టును సందర్శించామనే తృప్తి కలుగుతుంది.
- తడకమళ్ళ మురళీధర్,
విశ్రాంత జిల్లా జడ్జి
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
