ఘన వ్యర్థాలతో పర్యావరణ సంక్షోభం

ఘన వ్యర్థాలతో పర్యావరణ సంక్షోభం

హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతున్నదని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఐటీ, ఫార్మా, స్టార్టప్‌‌‌‌లు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు... అభివృద్ధి సూచికలు అనేకం కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో నగర అభివృద్ధి మరో పెద్ద సంక్షోభాన్ని కూడా పెంచుతోంది. 

అదే ఘన వ్యర్థాల నిర్వహణ. ఈ సంక్షోభానికి నిదర్శనం జవహర్‌‌‌‌నగర్ డంపింగ్ యార్డ్. ప్రతిరోజూ గ్రేటర్ హైదరాబాద్ నుంచి వేల టన్నుల చెత్త జవహర్‌‌‌‌నగర్‌‌‌‌కు చేరుతోంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలు అక్కడ ఒక చెత్త కొండను సృష్టించాయి. అది కేవలం చెత్త కుప్ప కాదు. నిశ్శబ్దంగా  పెరుగుతున్న పర్యావరణ విపత్తు. నెమ్మదిగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. 

భూతాపాన్ని పెంచే గ్రీన్‌‌‌‌హౌస్ వాయువు

సేంద్రియ వ్యర్థాలు కుళ్లిపోతూ మీథేన్ వాయువును విడుదల చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎన్నో రెట్లు అధికంగా భూతాపాన్ని పెంచే గ్రీన్‌‌‌‌హౌస్ వాయువు అది. వాతావరణ  మార్పులను  వేగవంతం చేయడంలో  మీథేన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి జవహర్‌‌‌‌నగర్ సమస్యను కేవలం స్థానిక చెత్త సమస్యగా చూడటం ప్రమాదకరం. అది హైదరాబాద్ నగరం వాతావరణ బాధ్యతకు సంబంధించిన అంశం కూడా. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ డంపింగ్ యార్డ్ ప్రభావం ముందుగా అక్కడి ప్రజలపైనే పడుతోంది. 

జవహర్‌‌‌‌నగర్, నాగారం, ఈసీఐఎల్, చక్రిపురం, రాంపల్లి, ఘట్‌‌‌‌కేసర్, ఉప్పల్, ఏఎస్ రావు నగర్, కీసర, నేరేడ్మెట్, తిరుమలగిరి తదితర ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా దుర్వాసన, గాలి కాలుష్యం, ఈగలు, దోమలు, కలుషిత వాతావరణంతో జీవిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, కిడ్నీ సంబంధిత అనారోగ్యాలపై స్థాని కుల ఆందోళనలు పదేపదే వినిపిస్తున్నాయి. భూగర్భ జలాల నాణ్యతపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో కొంతమంది ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు.

జవహర్‌‌‌‌నగర్  డంప్‌‌‌‌సైట్‌‌‌‌పై ఎన్‌‌‌‌జీటీ ఆందోళన

ఈ అంశాన్ని న్యాయవ్యవస్థ కూడా అత్యంత తీవ్రంగా పరిగణించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పలుమార్లు జవహర్‌‌‌‌నగర్ డంప్‌‌‌‌సైట్‌‌‌‌పై ఆందోళన వ్యక్తం చేసింది.  ఐఐటీ బొంబే నిపుణుల నివేదిక ఆధారంగా శాస్త్రీయ నిర్వహణకు చర్యలు చేపట్టాలని సూచించింది. అనంతరం తాజా చెత్త డంపింగ్‌‌‌‌పై కూడా కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలను టైమ్స్ ఆఫ్ ఇండియా సహా పలు జాతీయ మీడియా సంస్థలు విస్తృతంగా ప్రచురించాయి. 

అయినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయం. సమస్యకు పరిష్కారం కూడా ఉంది. ఒకే చోట నగరమంతా చెత్తను పోగు చేసే పాత విధానాన్ని విడిచిపెట్టాలి. వికేంద్రీకృత ఘన వ్యర్థాల నిర్వహణను అమలు చేయాలి. ప్రతి ఇంటి వద్దనే చెత్తను తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయాలి. 

సేంద్రియ వ్యర్థాలను కంపోస్టుగా మార్చాలి. పునర్వినియోగానికి అనువైన పదార్థాలను రీసైక్లింగ్ చేయాలి. మిగిలిన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ముఖ్యంగా ల్యాండ్‌‌‌‌ఫిల్ నుంచి వెలువడే మీథేన్‌‌‌‌ను సేకరించి ఇంధనంగా మార్చే వ్యవస్థలను అత్యవసరంగా ఏర్పాటు చేయాలి. ప్రపంచంలోని అనేక దేశాలు ఇదే విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి.

- ముద్దం శ్రీనివాస్ గౌడ్

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.