- ప్రతి గుడిసెకూ పట్టా ఇవ్వాలి.. అర్హులకు ఇండ్లు కట్టించాలి: కూనంనేని
- ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల మహాధర్నా
హైదరాబాద్, వెలుగు:పేదలు కష్టం నుంచే సంపద సృష్టి జరుగుతుందని, అలాంటి పేదల జోలికి వస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న గుడిసెల కూల్చివేతలను నిరసిస్తూ, ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలొచ్చిన నిరుపేదలు ధర్నా చౌక్ లో ఎర్ర జెండాలతో కదం తొక్కారు. కూనంనేని మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా పేదల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ మాఫియా వేల ఎకరాల భూదాన్, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. దమ్ముంటే ల్యాండ్ మాఫియా నుంచి ఎంత భూమిని స్వాధీనం చేసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైడ్రా పేరుతో పేదలను భయపెట్టడం మానేసి, పది మంది పెద్ద కబ్జాకోరులను పట్టి జైల్లో పెట్టాలని, అప్పుడు ప్రభుత్వానికి తామే దండలు వేస్తామన్నారు. వరంగల్ గుండ్ల సింగారంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పినా కలెక్టర్లు వెళ్లి కూల్చివేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల మాట వినని అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం హామీలను అమలు చేయాలి: జాన్ వెస్లీ
రాష్ట్రంలో ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు సొంత ఇళ్లు లేవని, హైదరాబాద్లో 60 శాతం మంది అద్దె ఇళ్లలోనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ పాలకులకు వందల ఎకరాల ఫామ్ హౌస్‌లు ఉండొచ్చు కానీ, పేదవాడికి 60 గజాల స్థలం ఉండకూడదా? అని నిలదీశారు.
