గండిపేట, వెలుగు: భారత్, సౌదీ అరేబియా మధ్య వైమానిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రియాద్‌కు ‘ఫ్లైదీల్’ తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసుతో సౌదియా గ్రూప్‌కు చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ‘ఫ్లైదీల్’ భారత విమానయాన మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టుకు సోమవారం చేరుకున్న తొలి ఫ్లైదీల్ విమానానికి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈవో కదిర్ కదిరవన్, ఫ్లైదీల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ లాయిడ్‌జో మిస్క్విట్టా, హెడ్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ అబ్దుల్‌రహ్మాన్ అల్‌రషీద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్వీసులను ప్రారంభించారు. సౌదీ అరేబియాకు వెళ్లే వారికి ఈ సర్వీసు అందుబాటు ధరల్లో ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది.
