- ఈ నెల 15 నుంచి నిర్వహణకు సన్నాహాలు
- డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో కదిలిన సింగరేణి యాజమాన్యం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ బోర్డు(డిపెండెంట్ ఎంప్లాయిమెంట్) నిర్వహణకు యాజమాన్యం సన్నాహాలు ప్రారంభించింది. గత 15 నెలలుగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును ఈ నెల 15 నుంచి తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో ఇప్పటివరకు మెడికల్ బోర్డు ద్వారా సుమారు 19 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించారు. అయితే బోర్డు నిర్వహణలో అవినీతి, అక్రమాల ఆరోపణలు, ఏసీబీ విచారణ, అదనపు కార్మికుల అంశం తదితర కారణాలతో 15 నెలల క్రితం దీనిని తాత్కాలికంగా నిలిపివేశారు.
దీంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించాయి. గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నిర్మాణాత్మక సమావేశాలను బహిష్కరించి నిరసన తెలిపింది. గుర్తింపు సంఘంతో పాటు ఐఎన్‌టీయూసీ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేసింది. ఇటీవల కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలోనూ మెడికల్ బోర్డు పునరుద్ధరణ అంశం ప్రస్తావనకు వచ్చింది. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోర్డును తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించగా, ఆ హామీ మేరకు ఈ నెల 15 నుంచి నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
వేలాది మంది ఎదురుచూపులు..
డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కింద మెడికల్ బోర్డు కోసం ప్రస్తుతం సుమారు 3 వేల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సింగరేణిలో ఇప్పటికే 7 వేల మందికి పైగా అదనపు కార్మికులు ఉన్నారని యాజమాన్యం గతంలో పేర్కొనడంతో, మెడికల్ బోర్డు నిరంతరంగా కొనసాగుతుందా లేదా అనే సందేహం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. సింగరేణి కార్మికుల వైద్య సంబంధిత పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 15న మెడికల్ బోర్డు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని గుర్తింపు సంఘమైన సింగరేణి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్ తెలిపారు. యాజమాన్యంతో పలు దశల్లో జరిపిన చర్చల ఫలితంగానే మెడికల్ బోర్డు నిర్వహణకు అంగీకారం లభించిందని పేర్కొన్నారు.
