పట్టాలేని రైతులకు యూరియా తిప్పలు!..జాగీర్దారీ, సీలింగ్, పోడు రైతులకు కష్టాలు

పట్టాలేని రైతులకు యూరియా తిప్పలు!..జాగీర్దారీ, సీలింగ్, పోడు రైతులకు కష్టాలు
  • దేవుడి మాన్యం సాగు చేసే కౌలు రైతులకు ఇబ్బందులు
  • ధరణి వల్ల కాస్తు కాలమ్ తీసేయడంతో సమస్య
  • యాప్‌‌లో నాన్ డిజిటల్ సిగ్నేచర్ (ఎన్‌‌డీఎస్) ఆప్షన్ వాడాలంటున్న ఆఫీసర్లు 

ఖమ్మం/ కొణిజర్ల, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులు, ఆన్‌‌లైన్‌‌లో వివరాలు తప్పుగా నమోదైన చాలామంది రైతులు యూరియా కోసం అవస్థలు పడాల్సివస్తోంది. రికార్డుల్లో తమ భూముల వివరాలు లేకపోవడంతో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్​ద్వారా యూరియా తీసుకోవడం సాధ్యం కావడంలేదు. తరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నా రికార్డుల్లో పేర్లు లేకపోవడంతో బస్తా యూరియా  కోసం కూడా పక్క రైతులను బతిలాడుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. 

జాగీర్దార్ భూములు, సీలింగ్ భూములను ఎప్పుడో కొనుక్కొని సాగు చేసుకుంటున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెం రైతులు, దొర భూములను సాగు చేసుకుంటున్న సూర్యాపేట జిల్లా నూతనకల్ దగ్గర ఎర్రపహాడ్ రైతులతో పాటు గతంలో కొందరు రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పుల వల్ల నష్టపోయిన సత్తుపల్లి మండలం బేతుపల్లి, పెనుబల్లి మండలం తాళ్లపెంట రైతులు, దేవుడి మాన్యం భూములు సాగు చేస్తున్న కౌలు రైతులు యూరియా బుక్ చేసుకునే అవకాశం లేక నష్టపోతున్నామని అంటున్నారు. ఇలాంటి రైతుల కోసం యాప్‌‌లో నాన్ డిజిటల్ సిగ్నేచర్ (ఎన్‌‌డీఎస్) ఆప్షన్ ఉందని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే, దానిపై అవగాహన లేక బాధిత రైతులు నష్టపోతున్నారు.

కొన్ని గ్రామాల్లోని పరిస్థితి ఇదీ..

  •  ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో 25,292 ఎకరాల భూములను 12,797 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో మాదారం, పేరుపల్లి, గేట్ కారేపల్లి, దుబ్బతండా గ్రామాల్లో 300 మంది రైతులు 800 ఎకరాల దేవాదాయ శాఖ భూములు సాగు చేస్తున్నారు. వీరికి నాన్ డిజిటల్ సిగ్నేచర్ (ఎన్‌‌డీఎస్​) గురించి అవగాహన లేక యూరియా కోసం ఇబ్బందిపడుతున్నారు. మండలంలో చీమలపాడు, బాజు మల్లయ్య గూడెం, రేలకాయలపల్లి, మాణిక్యారం, ఎర్రబోడు, కారేపల్లి, పేరుపల్లి గ్రామాల్లో 3 వేల ఎకరాల్లో పోడు భూములను సాగు చేస్తున్న 1,200 మంది గిరిజనేతర రైతులకు కూడా హక్కు పత్రాలు లేవు. వీరు కూడా యూరియా దొరక్క తిప్పలు పడుతున్నారు. మరికొన్ని గ్రామాలకు చెందిన 900 మంది గిరిజనులు హక్కు పత్రాలు రాక యూరియా పొందలేకపోతున్నారు.
  •  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెం రెవెన్యూ పరిధిలో సుమారు 400 ఎకరాల జాగీర్దారీ భూములు పూర్తిస్థాయిలో రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. గుబ్బగుర్తి రెవెన్యూ పరిధిలోని ఎల్లన్ననగర్, గుబ్బగుర్తి అటవీ ప్రాంతాల్లో వందల ఎకరాల సాగుభూములకు ఇప్పటికీ సర్వే పూర్తికాక పట్టాదారు పాస్‌‌ పుస్తకాలు జారీ కాలేదు. పెద్దగోపతి, తనికెళ్ల గ్రామాల్లో ధరణిలో తప్పులు, వారసత్వ వివాదాలు, ఆన్ లైన్ లోపాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా వేర్వేరు కారణాలతో మండలంలో సుమారు 1,500 ఎకరాలకు పాస్ బుక్‌‌లు లేవు.
  •  సత్తుపల్లి మండలం బేతుపల్లిలో 133 సర్వే నంబర్‌‌‌‌లో ఫీల్డ్ ఉన్న భూమి కంటే పాస్ పుస్తకాల్లో ఎక్కువ నమోదైంది. ఈ ఒక్క సర్వే నంబర్‌‌‌‌లోనే సుమారు నాలుగు వేల ఎకరాల భూమి ఉండగా, గతంలో ఉన్న కొందరు రెవెన్యూ సిబ్బంది డబ్బులకు కక్కుర్తి పడి బైనంబర్లు వేస్తూ రికార్డుల్లోకి ఎక్కించారు. వాస్తవంగా భూమి సాగు చేసుకుంటున్న చాలా మందికి ఆర్‌‌‌‌ఎస్‌‌ఆర్ లేక పాస్‌‌బుక్‌‌లు రాలేదు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం గ్రామంలో మొత్తం భూములను ప్రభుత్వం రీసర్వే చేయిస్తోంది.
  •  పెనుబల్లి మండలం తాళ్లపెంట రెవెన్యూలో 1 నుంచి 368 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 2,200 ఎకరాల భూమి ఉంది. గతంలో రెవెన్యూ సిబ్బంది తప్పిదాల వల్ల భూమి కంటే సర్వే నంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి గత ప్రభుత్వం సర్వే చేయకపోవడంతో సగం భూములకే పాస్ పుస్తకాలు వచ్చాయి. ఇంకా 1,200 ఎకరాలకు పాస్ పుస్తకాలు జారీ కాలేదు.
  •   పెనుబల్లి మండల కేంద్రంతో పాటు ఏజన్సీలోని వీఎం బంజరు, యడ్లబంజర్, ఉప్పలచిలక, లింగగూడెం, పార్థసారథిపురం, భవన్న పాలెం, గంగాదేవిపాడు పంచాయతీల్లో బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో కొందరికే ధరణి ద్వారా పాస్‌‌బుక్స్​వచ్చాయి. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నా.. గిరిజనేతరులు కావడం వల్ల చాలామంది పాస్‌‌బుక్స్ పొందలేకపోయారు. ఈ ఏజెన్సీ గ్రామాల్లో మొత్తం 10 వేల ఎకరాలకు గాను మూడు వేల ఎకరాలకు పైగా భూములు గిరిజనేతర రైతుల చేతుల్లో ఉన్నాయి. గతంలో పహానీలమీద తహసీల్దార్, వ్యవసాయ అధికారి సంతకంతో సహకార సంఘాల వద్ద ఏజెన్సీ రైతులు యూరియా కొనుగోలు చేసేవారు. ఈసారి యాప్ ప్రవేశపెట్టడంతో ఏజెన్సీ రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎన్‌‌డీఎస్ ఆప్షన్ తమకు తెలియదని రైతులు అంటున్నారు.
  •   సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్రపహాడ్‌‌లో సుమారు 1,780 మంది రైతులు 3 వేల ఎకరాల సీలింగ్ భూములను ఐదు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా సాగులో ఉన్నా వారికి పట్టాదారు పాస్​ పుస్తకాల్లేవు. దీంతో వారికి యూరియా కట్టలు దొరకడం గగనంగా మారింది.
  •   సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రపోడులో సర్వే నంబర్ 540లో 6,200 ఎకరాల భూములున్నాయి. వీటిలో సగం వరకు పోడు భూములు ఉండడంతో సాగులో ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించలేదు. దీంతో పట్టాదారు పాస్‌‌బుక్‌‌లు లేవు.
  •   సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలో 52 సర్వే నంబర్‌‌‌‌లో 636 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 120 ఎకరాలను 40 కుటుంబాలకు పంచగా 1,968 నుంచి వారు సాగుచేసుకుంటున్నారు. నెమలిపురి, వజినేపల్లి సరిహద్దు విషయంలో ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య వివాదంతో ఆ 40 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. వారికి పట్టాలివ్వాలని మూడేండ్ల కింద కోర్టు తీర్పు ఇచ్చినా, ఇంతవరకు అధికారులు అమలు చేయలేదు.
  •   ఆదిలాబాద్ జిల్లాలో పోడు సాగుచేసుకుంటున్న వారిలో దాదాపు 2 వేల మందికి పోడు పాస్ పుస్తకాలు రాలేదు. దీంతో జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల వరకు వారు సాగు చేస్తున్న భూములకు యూరియా తెచ్చుకునే పద్ధతిపై గిరిజనులకు అవగాహన లేక ఇబ్బందిపడుతున్నారు.

యూరియా లేక పత్తి ఎదుగుదల ఆగిపోయింది

మా ఊరిలోనే ఐదు ఎకరాల జాగీర్దారీ భూమిని కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నాను. ధరణి రికార్డుల సమస్యల వల్ల పాసు పుస్తకాల్లేక ఇప్పటివరకు ఒక్క కేజీ యూరియా కూడా కొనలేకపోయాను. యూరియా లేక పత్తి పంట ఎదుగుదల ఆగిపోయి ఉంది. ఇతర రైతులను అడిగినా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. అధికారులు వెంటనే ప్రత్యామ్నాయంగా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మా వంటి కౌలు రైతులకు తీవ్రనష్టం తప్పదు. - భూక్యా రాందాస్, గిరిజన కౌలు రైతు, మేకలకుంట, కొణిజర్ల మండలం 

ఎన్‌‌డీఎస్​ ఆప్షన్‌‌ను ఉపయోగించుకోవాలి

వేర్వేరు కారణాల వల్ల పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారి కోసం ఫెర్టిలైజర్ యాప్​ లో ఎన్‌‌డీఎస్ ఆప్షన్ ఇచ్చారు. దేవుడి మాన్యం సాగు చేస్తున్న కౌలు రైతులు ఆ దేవాలయ ఈవో నుంచి లెటర్ తెచ్చుకోవాలి. ఇతర రైతులు తహసీల్దార్ నుంచి తాము సాగు చేస్తున్న భూముల వివరాలను రాయించుకొని మండల అగ్రికల్చర్​ ఆఫీసర్‌‌‌‌ను కలిస్తే ఎన్‌‌డీఎస్ ద్వారా యూరియా తీసుకోవచ్చు. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

-డి.పుల్లయ్య, ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి