వాషింగ్టన్/టెల్ అవీవ్: ఇరాన్ యుద్ధానంతర దౌత్య చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఉన్న ఏకైక శక్తిమంతమైన మిత్రదేశం అమెరికా మాత్రమేనంటూ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. భారత్‌తో పాటు మరెన్నో దేశాలతో తమకు బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.
జేడీ వాన్స్‌పై తనకు గౌరవం ఉందని, ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయని పేర్కొన్నారు. అయినా ఆయన చెప్పే ప్రతి విషయాన్నీ తాను తప్పనిసరిగా అంగీకరించాల్సిన అవసరంలేదన్నారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో తమకు అపారమైన మద్దతు ఉందన్నారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో కామెంట్లను చూస్తే భారతీయుల నుంచి లభిస్తున్న భారీ ఆదరణ, సానుభూతి స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు.
తాము సాంకేతిక రంగంలో ముందున్నామని, ఎన్నో దేశాలు ఇజ్రాయెల్ భాగస్వామ్యం కోరుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. ‘‘ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో మా దేశం రెండో స్థానంలో ఉంది. మా సైనిక వ్యూహాలు, అత్యాధునిక సాంకేతికతను తమకు కూడా నేర్పించాలని, సైబర్ భద్రతలో సహాయం చేయాలని చాలా దేశాల నేతలు నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్నారు. బయటకు కనిపించే రాజకీయాలు వేరు, అంతర్గతంగా మాకున్న సంబంధాలు వేరు’’ అని నెతన్యాహు స్పష్టంచేశారు.
మోదీ నాకు ఆప్తమిత్రుడు..
భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని, భారత ప్రధాని మోదీ తనకు ఆప్తమిత్రుడని నెతన్యాహు గతంలో పలుమార్లు పేర్కొన్నారు. భారత్‌ను ఒక గ్లోబల్ పవర్‌గా అభివర్ణించారు. గతంలో ప్రధాని మోదీ కూడా భారత్ పూర్తివిశ్వాసంతో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుందని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా నిపుణులు గుర్తుచేస్తున్నారు.
