జమ్మూ: పహల్గామ్ ఉగ్రదాడి వెనుక అసలు సూత్రధారి, లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్‌యేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్పష్టం చేసింది. నిరుడు ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ ఆదివారం జమ్మూలోని ప్రత్యేక కోర్టులో కీలక అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. లష్కరే తోయిబా, దాని ప్రాక్సీ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) వ్యవస్థాపకుడిగా, వ్యక్తిగత హోదాలోనూ హఫీజ్ సయీద్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొన్నది.
ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి స్క్రీన్‌ప్లే పాకిస్తాన్ నుంచే నడిచిందని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో ఆధారాలతో సహా వివరించింది. హఫీజ్ సయీద్ స్వయంగా ఉగ్రవాదులకు దిశా నిర్దేశం చేస్తూ, ప్లాన్ అంతా సిద్ధం చేసి, ఇక్కడి దాడులను పర్యవేక్షించాడని ఏజెన్సీ స్పష్టం చేసింది.
ఈ మేరకు సయీద్‌పై బీఎన్‌ఎస్ 2023, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)-1967 కింద దేశంపై యుద్ధం ప్రకటించడం, క్రిమినల్ కుట్రలాంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో దాఖలు చేసిన 1,597 పేజీల ప్రధాన చార్జ్‌షీట్‌కు అదనంగా ఈ అనుబంధ చార్జ్‌షీట్‌ను చేర్చారు. ఇందులో పాకిస్తాన్ పాత్ర, సయీద్ ప్రత్యక్ష ప్రమేయం, ఘటనా స్థలం నుంచి సేకరించిన శాస్త్రీయ, ఫోరెన్సిక్, టెక్నికల్ ఎవిడెన్స్‌ను ఎన్ఐఏ పొందుపరిచింది.
