టెహ్రాన్: అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. మంగళవారం (జులై 7) ఒమన్ తీరంలోని హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తోన్న రెండు వాణిజ్య నౌకలపై మిస్సైల్ దాడి జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ దాడులకు పాల్పడిందని ఓ అమెరికా అధికారిని ఉటంకిస్తూ ఆక్సియోస్ మీడియా నివేదించింది. దాడికి గురైన నౌకలు ఏ దేశానికి చెందినవనే దానిపై సమాచారం లేదు.
కాగా, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్‌కు వారం రోజులు బ్రేక్ ఇచ్చామని.. మేం తల్చుకుంటే ఆ దేశ అగ్రనాయకత్వాన్ని అంతా ఒక్క దెబ్బతో లేపేయగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే తాజాగా హార్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు పాల్పడిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం ఈ దాడులను ధృవీకరించలేదు. ఏదేమైనప్పటికీ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ హార్మూజ్ జలసంధిలో దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
సుధీర్ఘకాలంగా నడుస్తోన్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్-అమెరికా మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం హార్మూజ్ జలసంధిలో దాడులను నిలిపివేయడానికి ఇరాన్, అమెరికా అంగీకరించాయి. ఈ నిర్ణయంతో ప్రపంచ నౌకయానానికి మార్గం సుగమమైంది. ఈ తరుణంలో ఒప్పందం కుదిరిన కేవలం మూడు వారాల్లోనే హార్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొనడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ చర్య ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాల్లో మళ్లీ టెన్షన్ నెలకొంది.
