జకార్తా: ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా 3 దేశాల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇండోనేసియా చేరుకున్నారు. మోదీ విమానం జకార్తా గగనతలంలోకి ప్రవేశించగానే.. ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా నిలిచాయి.
ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఎయిర్పోర్ట్కు వచ్చి మోదీకి స్వయంగా స్వాగతం పలికారు. సంప్రదాయ కార్యక్రమాలతో పాటు గౌరవ వందనం సమర్పించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చూపిన ఆత్మీయత నన్ను ఎంతగానో కదిలించిందని పేర్కొన్నారు.
2018 తర్వాత తొలిసారి..
2018లో భారత్–ఇండోనేసియా సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన తర్వాత మోదీ చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ఈ భాగస్వామ్యం రెండు దేశాల ప్రజలకు ఎంతో మేలు చేసిందని మోదీ సోషల్ మీడియా వేదికగా అన్నారు.
ప్రెసిడెంట్ ప్రబోవోతో జరగనున్న చర్చలు వివిధ రంగాల్లో ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయన్నారు. ఈ పర్యటనలో భాగంగా యోగ్యకర్తలోని ప్రసిద్ధ ప్రంబనన్ హిందూ దేవాలయ సముదాయాన్ని అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి సందర్శించనున్నట్లు మోదీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాలు మరింత బలపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
