మంచంపై నుంచి పడి బిడ్డ చనిపోయిందన్న భార్యాభర్త.. అసలు నిజం బయటపెట్టిన పోస్ట్మార్టం రిపోర్ట్ !

మంచంపై నుంచి పడి బిడ్డ చనిపోయిందన్న భార్యాభర్త.. అసలు నిజం బయటపెట్టిన పోస్ట్మార్టం రిపోర్ట్ !

బెంగళూరు: సంసారం అన్నాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సహజం. అయితే.. ఈ గొడవలు, మనస్పర్థలు ముదిరితేనే కాపురం పేకమేడలా కుప్పకూలిపోతుంది. కొన్ని సందర్భాల్లో కడుపున పుట్టిన బిడ్డలకు కూడా కన్న వాళ్ల గొడవలు శాపంగా మారతాయి. బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో సరిగ్గా అదే జరిగింది. భార్యాభర్త మధ్య జరిగిన గొడవలో అభంశుభం తెలియని 11 నెలల పాప ప్రాణం పోయింది. భార్యతో జరిగిన గొడవలో అసహనానికి గురైన భర్త.. 11 నెలల కన్న కూతురుని విసిరికొట్టాడు. ఈ ఘటనలో పాప స్పాట్లోనే చనిపోయింది. అయితే.. భార్యాభర్త ఈ హత్యను ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

పాప మంచంపై నుంచి పొరపాటున బోర్లాపడటంతో కింద పడి చనిపోయినట్లు భార్యాభర్త అందరినీ నమ్మించారు. అయితే.. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు గతంలో కూడా గమనించిన ఇరుగుపొరుగు వాళ్లు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఈ భార్యాభర్త వ్యవహార శైలిపై సందేహపడ్డారు. పాప మృతదేహానికి పోస్టుమార్టం చేశాక పాపది సహజ మరణం కాదు, హత్య అని తేలింది. అంతర్గత గాయాల వల్ల పాప చనిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ గాయాలు రెండు అడుగుల ఎత్తు ఉన్న మంచం పైనుంచి పడితే తగినట్లు లేవని.. బలంగా విసిరికొడితేనే ఇంత స్థాయిలో గాయాలవుతాయని పోస్టుమార్టం చేసిన వైద్యులు నిర్ధారించారు.

వైట్‌ఫీల్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సైదులు అద్వైత్ ప్రకారం.. ఈ ఘటన బెంగళూరులోని అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. "పక్కటెముకలు, ఇతర ఎముకలు విరగడం, అంతర్గత రక్తస్రావం, షాక్, శ్వాసకోశ వ్యవస్థ వైఫల్యం వంటి పలు అంతర్గత గాయాలే మరణానికి కారణమని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా భార్యాభర్తను అదుపులోకి తీసుకుని విచారించడంతో క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసిందని డీసీపీ అద్వైత్ అన్నారు. ఈ గాయాల కారణంగానే చిన్నారి మరణించిందని సాక్ష్యాధారాలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. పాప తండ్రిని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో పోలీసులు తల్లిని కూడా నిందితురాలిగా పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 3(5) తో కలిపి సెక్షన్ 103(1) కింద తల్లిదండ్రులిద్దరిపై FIR నమోదు చేశారు.