- అయోధ్య చందాలను కొల్లగొట్టారు.. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు
- బీజేపీ లీడర్లు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు: బీజేపీ నేతలు హిందువుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో అవినీతికి పాల్పడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని జిల్లెలగడ్డలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం కట్టాలని గతంలో శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు. భక్తి, రాముడి పేరుతో రాజకీయం చేసే బీజేపీ పెద్దలు అయోధ్య ట్రస్ట్ అవినీతిపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా ప్రజలు భక్తితో ఇచ్చిన కోట్ల రూపాయల విరాళాలను, కానుకలను కొల్లగొట్టారని ఆరోపించారు. 'రాముడి పేరు, అక్షింతల పేరు చెప్పి ప్రతి ఊర్లో ఓట్లు అడిగారని, వారి అవినీతిని ముందే ఊహించిన ప్రజలు ఆ పార్టీని ఓడించి బుద్ధి చెప్పారు, దేవుడి పేరుతో జరిగిన స్కామ్‌పై తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి' అని అన్నారు.
హిందువులను అవమానించినందున బీజేపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను శ్రీరాముడికి వ్యతిరేకం కాదని, తాను ఎంపీగా ఉన్న టైంలో ఇల్లందకుంట రామాలయంలో ప్రారంభించిన అన్నదానం ఇప్పటికీ నడుస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మజ్లిస్ పార్టీని తిట్టకుండా బతకలేరని, ఆయనకు ఇతరులను తిట్టడమే రాజకీయమని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా సవరణను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, పట్టణ అధ్యక్షుడు వీవీ.రమణ, మండల అధ్యక్షుడు వెన్న రాజు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య పాల్గొన్నారు.
