పది రోజులు అవకాశం ఇస్తే ఏం చేస్తరు ? : మంత్రి సీతక్క

పది రోజులు అవకాశం ఇస్తే ఏం చేస్తరు ? : మంత్రి సీతక్క

మహబూబాబాద్/ ములుగు/ వెంకటాపూర్, వెలుగు : అధికారంలోకి రావాలన్న ఆశతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తు్న్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. సోమవారం మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడెంలో నూతన డిగ్రీ కాలేజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రజల దృష్టి మళ్లించడానికి ఆర్భాటంగా కాళేశ్వరం టూర్ పేరుతో అక్కడికి వెళ్లి చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో వారం రోజులపాటు కేసీఆర్ కు అధికారం ఇస్తే ఒరిగేది ఏమీ లేదన్నారు. 10 ఏండ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి కాళేశ్వరాన్ని నిర్మించగా, వారి పరిపాలనలోనే కూలిపోయిందన్నారు. 

నాడు ప్రజాధనాన్ని వృథా చేశారని, నీళ్ల పేరుతో నిధులను ఎత్తిపోశారన్నారు. రూ1.50 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ప్రజలను నిండా ముంచిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అధికారం లేకుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకి రాడా అని ప్రశ్నించారు. మూడేండ్ల నుంచి ఎందుకు ప్రజలకు ముఖం చూపించడం లేదన్నారు. బీఆర్ఎస్​ నాయకుల స్వయం ప్రకటిత ఇంజినీరింగ్ అద్భుతాలు ఏమయ్యాయో ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ నాయకుల గ్లోబల్ ప్రచారాన్ని గమనించాలన్నారు. 

మేడారం మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక దృష్టి సారించాలి

మేడారం ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో కొనసాగుతున్న పెండింగ్ అభివృద్ధి పనులను గడువులోపు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆఫీసర్లను ఆదేశించారు. ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం ఆలయ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, ఐడీవోసీ పనుల పురోగతి, రామచంద్రపురం భూసర్వే, పైలాన్ నిర్మాణం, వర్షాల పరిస్థితి, సీఎం పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన సన్నాహక చర్యలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సీఎం ములుగు జిల్లాలో పర్యటించే సందర్భంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం ఆలయ పరిసరాల్లో భూసేకరణ, రహదారుల విస్తరణ, క్యూ లైన్ల పునర్వ్యవస్థీకరణ, అతిథి గృహం, ఆసుపత్రి, కాటేజీలు, పార్కింగ్, పారిశుధ్య సదుపాయాలు, జంపన్న వాగు పరిసరాల అభివృద్ధి తదితర అంశాలతో సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.