- రెండేళ్ల అభివృద్ధి, పార్టీకి చేసిన సేవలతో రెన్యూవల్‌పై కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆశలు
- రేసులో అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి బీసీ కోటాలో కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్
కరీంనగర్, వెలుగు: శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పదవీకాలం ఈ నెల 8తో ముగియనుంది. రెండేళ్ల పదవీకాలాన్ని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేయడమేగాక, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నరేందర్‌రెడ్డిని కొనసాగిస్తారా..? లేదంటే కొత్తవారికి అవకాశమిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇదే పదవి కోసం కాంగ్రెస్ నేతఅల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ పోటీపడుతున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎవరికి మద్దతిస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా తన అనుచరుడు ఆకుల నర్సయ్య ఎంపిక కావడంలో కీలకంగా పనిచేసిన కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు.. సుడా చైర్మన్‌గా ఎవరిని ప్రతిపాదిస్తారనే చర్చ జరుగుతోంది.
రెన్యూవల్‌పై ప్రస్తుత చైర్మన్ ఆశలు
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరీంనగర్‌లో కాంగ్రెస్ చేపట్టిన అనేక ఆందోళనల్లో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చాక 2024లో ఆయనను ప్రభుత్వం సుడా చైర్మన్‌గా నియమించింది. ఈ రెండేళ్లలో సుడా పరిధిలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారు. కరీంనగర్ సిటీలో బీజేపీ, బీఆర్ఎస్ లీడర్ల ప్రకటనలకు కౌంటర్ ఇవ్వడంలో, వారి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో నరేందర్‌రెడ్డి మిగతా లీడర్లతో పోలిస్తే ముందుంటారనే పేరుంది. పార్టీకి, సుడాకు తాను చేసిన సేవలకు గుర్తింపుగా తన పదవిని రెన్యూవల్ చేస్తారని నరేందర్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఆయన గురువు, మంత్రి శ్రీధర్ బాబుపైనే భారం వేశారు.
రేసులో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, రాజేందర్..
సుడా చైర్మన్ పదవికి ఈసారి తన పేరును పరిశీలించాలని కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. నరేందర్‌రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. దీంతో ఆయన పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన మల్లికార్జున రాజేందర్ కూడా సుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది.
మేయర్ ఎన్నికలో కాంగ్రెస్ స్ట్రాటజీ సక్సెస్ అయితే మల్లికార్జున రాజేందర్ లేదంటే ఆకుల నర్మద మేయర్ అయ్యేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుడా చైర్మన్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీలకు అప్పగించాల్సి వస్తే కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ పేరు హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
