త్వరలో పాత జీహెచ్‌‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను భారం పడే అవకాశం

త్వరలో పాత జీహెచ్‌‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను భారం పడే అవకాశం
  • విలీనమైన 27 లోకల్ బాడీల్లో ఇప్పటికే ‘క్యాపిటల్ వ్యాల్యూ’
  • ఇదే విధానం 3 కార్పొరేషన్లలో అమలుకు బిల్లులో ప్రతిపాదన

హైదరాబాద్ సిటీ, వెలుగు: త్వరలో పాత జీహెచ్‌‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను భారం పడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ పరిధిలో తీసుకురానున్న కొత్త  చట్టంలో ప్రాపర్టీ ట్యాక్స్​విధానంలో కీలక మార్పులు చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం పాత జీహెచ్‌‌ఎంసీ పరిధిలో అమల్లో ఉన్న అద్దె విలువ (రెంటల్ వ్యాల్యూ) ఆధారిత పన్ను విధానానికి బదులుగా..క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు.

జీహెచ్‌‌ఎంసీలో గతేడాది విలీనమైన 27 లోకల్ బాడీల్లో  క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే, పాత జీహెచ్‌‌ఎంసీ పరిధిలో మాత్రం ఇప్పటికీ పాత విధానమే కొనసాగుతున్నది. దీంతో ఒకే నగరంలో రెండు రకాల పన్ను విధానాలు అమల్లో ఉండడం కరెక్ట్​కాదని, మొత్తం మూడు కార్పొరేషన్లలో ఒకే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

అసెంబ్లీలో క్యూర్ బిల్లు ప్రవేశపెట్టే ముందే ప్రాపర్టీ ట్యాక్స్​కి సంబంధించి క్లారిటీ వచ్చేలా నోటికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే పాత జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని రెసిడెన్షియల్ తో పాటు కమర్షియల్ బిల్డింగులపై ఆస్తి పన్ను భారీగా పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య ప్రాంతాలు, అధిక మార్కెట్ విలువ ఉన్న ప్రాంతాల్లోని ఆస్తుల యజమానులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

17 లక్షల మందిపై భారం..
మూడు కార్పొరేషన్లలో 28,80,260 మంది ఆస్తి పన్ను కడుతుండగా, ఇందులో జీహెచ్ఎంసీ లో 11,45,321, సీఎంసీలో 9,43,432 , ఎంఎంసీలో 7,91,507 మంది ఉన్నారు. 27 విలీన ప్రాంతాల్లో ఉన్నవారు ఇప్పటికే క్యాపిటల్​వాల్యూ ప్రకారం ఆస్తి పన్ను కడుతుండగా కొత్త చట్టం అమల్లోకి వస్తే పాత జీహెచ్​ఎంసీ పరిధిలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఓపెన్ ల్యాండ్స్ కేటగిరీల్లో ట్యాక్స్​పే చేస్తున్న 17 లక్షల మందిపై భారం పడే అవకాశం ఉంది.

డబ్బులు.. డబుల్​
ఇప్పటివరకు ఓపెన్ ల్యాండ్ కు ఏటా మార్కెట్ వ్యాల్యూలో 0.50 శాతం, రెసిడెన్షియల్ కు రెంటల్​వాల్యూలో 60 పైసల నుంచి రూ.1.25 పైసలు, కమర్షియల్ కు కనిష్టంగా రూ.1.25 నుంచి గరిష్టంగా ఏటీఎం కేంద్రాలకు రూ.65 వరకు వసూలు చేస్తోంది. అలాగే, ఏరియాని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జీహెచ్ఎంసీ ట్యాక్స్​వసూల్ చేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, మాదాపూర్ ప్రాంతాల్లో అత్యధికంగా పన్ను తీసుకుంటుండగా, కొత్త చట్టం వస్తే డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు జూబ్లీహిల్స్ లో ఉండే ఒక ఏటీఎంకు ప్రస్తుతం ఏడాదికి రూ.26 వేలు చెల్లిస్తుండగా, పెరిగితే గనుక రూ40 వేల నుంచి రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా లంగర్ హౌస్ లాంటి సాధారణ రెసిడెన్షియల్​ప్రాంతాల్లో వెయ్యి చదరపు ఫీట్లలో ఉన్న ఇంటికి ప్రస్తుతం రూ.3500 వరకు తీసుకుంటుంగా, క్యాపిటల్ వ్యాల్యూలో 0.1 నుంచి 0.5 శాతం  వరకు వేస్తే ఇది సుమారు రూ.7వేలు అయ్యే ఛాన్స్​ఉంటుంది.  అయితే, పన్ను పెంపును దశలవారీగా అమలు చేయాలని, అవసరమైన వర్గాలకు రాయితీలు కల్పించాలని ప్రాపర్టీదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

క్యూర్ పరిధిలో రూ.5 వేల కోట్లు
మూడు కార్పొరేషన్లకి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.2558.80 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. సీఎంఎసీ నుంచి రూ.1003.36 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి రూ. 995.82 కోట్లు, ఎంఎంసీ నుంచి రూ. 562.62 కోట్ల కలెక్షన్​వచ్చింది. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ ఆదాయం రూ.5 వేల కోట్లకు చేరుతుంది. క్యాపిటల్​వ్యాల్యూలో రెసిడెన్షియల్ కి 0.1 నుంచి 0.5 శాతం, కమర్షియల్ 0.3 నుంచి 0.5 శాతం పన్ను విధించే అవకాశం ఉంటుందని ఆస్తి పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు.