రెండు జిల్లాల వారధికి.. ఐదేళ్లకు మోక్షం..మెదక్, కామారెడ్డి జిల్లాల మధ్య మంజీరా నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం

 రెండు జిల్లాల వారధికి.. ఐదేళ్లకు మోక్షం..మెదక్, కామారెడ్డి జిల్లాల మధ్య మంజీరా నదిపై హైలెవల్  బ్రిడ్జి నిర్మాణం
  •     అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో ఏండ్లుగా నిరుపయోగం
  •     మెదక్ ఎమ్మెల్యే కృషితో ఎట్టకేలకు రూ.22.50 కోట్లు మంజూరు
  •     పనులు పూర్తయితే రెండు జిల్లాల  ప్రజలకు తప్పనున్న దూరభారం

మెదక్/పాపన్నపేట, వెలుగు: మెదక్, కామారెడ్డి జిల్లాలను అనుసంధానిస్తూ నిర్మించిన బ్రిడ్జిని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కోట్లు వెచ్చించి నిర్మించిన బ్రిడ్జి ఐదేండ్లుగా వృథా ఉంది. మెదక్​ ఎమ్మెల్యే చొరవతో అప్రోచ్​ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్​ మంజూరు చేయడంతో రెండు జిల్లాల ప్రజలకు దూరభారం తప్పనుంది.

తీరనున్న తిప్పలు..

మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులో మంజీరా నది ప్రవహిస్తోంది. నదికి ఇవతలి వైపు మెదక్  జిల్లాలోని పాపన్నపేట మండలం, అవతలి వైపు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం ఉన్నాయి. ఈ మండలాల పరిధిలోని గ్రామాలు అర కిలోమీటరు దూరంలోనే ఉన్నప్పటికీ.. ఇక్కడి వారు అక్కడికి, అక్కడివారు ఇక్కడికి రాలేని పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డి, మెదక్  పట్టణాల మీదుగా 50 నుంచి 60 కిలోమీటర్లు తిరిగి రెండు, మూడు బస్సులు మారి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈక్రమంలో రెండు జిల్లాలను కలుపుతూ మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్  దశాబ్దాల నుంచి ఉంది. బ్రిడ్జి నిర్మాణంతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల వారికి, మెదక్  జిల్లాలోని పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట మండలాల ప్రజల కష్టాలు తీరుతాయి.

2017లో  బ్రిడ్జి మంజూరైనా!

తెలంగాణ ఏర్పాటు అనంతరం మంజీరా నదిపై హై లెవల్​ బ్రిడ్జి ప్రతిపాదనలకు మోక్షం లభించింది. 2015లో నిజామాబాద్  జిల్లా ఆఫీసర్లు సర్వే చేశారు. 2017లో బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. 2018లో మెదక్​ జిల్లా పాపన్న పేట మండలం రాంతీర్థం, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకాయపల్లి మధ్య మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. 

2021లో బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. కామారెడ్డి జిల్లా పరిధిలో నది ఒడ్డు నుంచి అప్రోచ్​ రోడ్డు నిర్మించడంతో పాటు తాండూర్  మీదుగా ఎల్లారెడ్డి మెయిన్  రోడ్డు వరకు బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు. అయితే మెదక్  జిల్లా పరిధిలో రాంతీర్థం వద్ద బ్రిడ్జి దగ్గర నుంచి పాపన్నపేట వరకు అప్రోచ్  రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు హై లెవల్  బ్రిడ్జి, కామారెడ్డి వైపు అప్రోచ్  రోడ్డు నిర్మాణానికి ఖర్చయ్యాయి. ఫండ్స్  లేక మెదక్  వైపు అప్రోచ్  రోడ్డు పనులు పెండింగ్ లో పెట్టారు.

ఎట్టకేలకు నిధులు మంజూరు..

రాంతీర్థం నుంచి పాపన్నపేట వరకు 4 కిలో మీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. 1.6  కిలోమీటర్ల ఆర్అండ్ బీ రోడ్డు, 7 కిలోమీటర్ల పీఆర్​ రోడ్డు ఉండగా, మరో 2.1 కిలోమీటర్ల రోడ్డు కొత్తగా ఫార్మేషన్  చేయాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మెదక్  ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు​ఆర్అండ్ బీ అధికారులతో చర్చించి నిధుల కోసం మరోసారి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం రూ.22.50 కోట్లు మంజూరు చేసింది.