బండ్ల అమ్మకాల్లో 22 శాతం వృద్ధి.. జూన్ నెలలో25 లక్షల వెహికల్స్ అమ్మకం

బండ్ల అమ్మకాల్లో 22 శాతం వృద్ధి.. జూన్ నెలలో25 లక్షల వెహికల్స్ అమ్మకం

న్యూఢిల్లీ:  ఆటోమొబైల్ రిటైల్ విక్రయాలు గత నెల జూన్‌లో వార్షిక ప్రాతిపదికన 21.83 శాతం వృద్ధితో 25.57 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో వర్షభావ లోటును రుతుపవనాలు భర్తీ చేస్తాయనే ఆశతో పరిశ్రమ జాగ్రత్తగా ముందడుగు వేస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సోమవారం తెలిపింది. 

గతేడాది జూన్‌లో 20,98,996 యూనిట్లు అమ్ముడయ్యాయి.  గత నెలలో ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రిటైల్ అమ్మకాలు 28.63 శాతం వృద్ధితో 4,10,853 యూనిట్లుగా నమోదయ్యాయి. గత జూన్​లో ఇవి 3,19,412 యూనిట్లుగా ఉన్నాయి. 

టూ వీలర్స్ అమ్మకాలు వార్షికంగా 21.22 శాతం వృద్ధితో 18,28,458 యూనిట్లకు పెరిగాయి.  త్రీ వీలర్స్ అమ్మకాలు 16.2 శాతం పెరిగి 1,20,889 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వెహికల్స్ సేల్స్​ కూడా 16.88 శాతం పెరిగి 90,972 యూనిట్లకు చేరాయి.