మెదక్ టౌన్, వెలుగు: ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి ఆర్.ఎం శుభవల్లి సోమవారం తీర్పునిచ్చారని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. రెండేండ్ల కింద ఆటో డ్రైవర్ రజాక్(27) పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
అనంతరం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై బాధితురాలు ప్రశ్నించగా ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, తన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ. లక్ష పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
