న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని మోదీ సర్కార్ లోపభూయిష్టమైన నిర్ణయాలతో అంతర్జాతీయ వేదికలపై ఇండియా ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పలు అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ ఇందుకు ఉదాహరణ అని అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం.. 2013లో ప్రపంచ దేశాల జాబితాలో 74వ స్థానంలో ఉన్న భారత్.. ఈ ఏడాది 80వ స్థానానికి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మోదీ పాలనలో పాస్‌పోర్ట్ ఖరీదైనదిగా మారిందని మండిపడ్డారు. ‘‘గతంలో సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 ఉండగా.. దాన్ని రూ.2,500కి పెంచారు. తత్కాల్ చార్జీలను ఏకంగా రూ.5,000కు పెంచారు’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మరోవైపు, విదేశీ పర్యాటకుల రాకను సులభతరం చేయడంలో మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు.
2019లో దేశానికి 1.09 కోట్ల మంది పర్యాటకులు వస్తే.. 2024 నాటికి కేవలం 99.5 లక్షలకు పడిపోయిందన్నారు. ‘అతిథి దేవో భవ’ అనే సంస్కృతి కలిగిన భారత్.. టూరిస్టులకు ఇలాగే స్వాగతం పలుకుతుందా అని ప్రశ్నించారు. ‘‘బలహీనమైన పాస్‌పోర్ట్, కోలుకోని టూరిజం, నాసిరకం వీసా సేవలతో.. కాస్ట్‌లీగా మారిన పాస్‌పోర్ట్ సేవలు. ఇదేనా గ్లోబల్ రెస్పెక్ట్ అంటే..’’అని ఖర్గే నిలదీశారు.
