ఎంఎస్‌‌ఎంఈల గొంతు నొక్కుతోంది: కేంద్రంపై రాహుల్గాంధీ ఫైర్

ఎంఎస్‌‌ఎంఈల గొంతు నొక్కుతోంది: కేంద్రంపై రాహుల్గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్‌‌పోర్ట్ రూల్స్ దేశంలో బస్సు, ట్రక్ బాడీ బిల్డింగ్ వర్క్‌‌షాప్‌‌లను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎంఎస్‌‌ఎంఈలకు మద్దతు ఇవ్వాల్సింది పోయి వాటి గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘వోకల్ ఫర్ లోకల్’ కేవలం నినాదాలుగానే మిగిలిపోయాయని, ప్రభుత్వ విధానాలు పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని అన్నారు. 

ఇటీవల జైపూర్‌‌లోని ఒక బస్సు, ట్రక్ బాడీ బిల్డింగ్ వర్క్‌‌షాప్‌‌ను సందర్శించిన రాహుల్ అక్కడి కార్మికులు, యజమానులతో మాట్లాడిన వీడియోను సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇనుప రేకులు, వెల్డింగ్ పనులు, సమ్మెట శబ్దాల మధ్య పనిచేస్తున్న ఈ శ్రామికులు దేశానికి ఉపాధిని, అభివృద్ధిని అందిస్తున్నారని చెప్పారు. అయితే ఢిల్లీలోని రవాణా మంత్రిత్వ శాఖ రూపొందించిన రూల్స్​వల్ల దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్న పరిశ్రమలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. 

సాంకేతిక లోపాలతో బస్సుల్లో మంటలు చెలరేగినా, వాహనాల బాడీలు తయారు చేసే చిన్న వర్క్‌‌షాప్‌‌లపైనే నిందలు వేస్తున్నారని ఆరోపించారు. చిన్న పరిశ్రమలు మూతపడితే వ్యాపారం మాత్రమే కాదు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉపాధి కోల్పోతారని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో లక్షల కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని, సామాన్యులపై ఇన్‌‌ఫ్లేషన్ భారం కూడా పెరుగుతుందని చెప్పారు. 

ఈ సమస్యపై ఇప్పటికే రాజస్తాన్‌‌కు చెందిన బస్సు, ట్రక్ బాడీ బిల్డర్లతో కలిసి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశామని గుర్తు చేశారు. లైసెన్సుల కోసం అధిక ఖర్చులు, ఎక్కువ సమయం పడుతున్నాయని బాడీ బిల్డర్లు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చినా ఇప్పటికీ పరిస్థితి మారలేదని, ప్రభుత్వం పెద్ద కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తోందని బాడీ బిల్డింగ్​సంస్థల ప్రతినిధులు తనతో చెప్పినట్టు రాహుల్ గాంధీ తెలిపారు.