భారత్, జపాన్ ఉమ్మడి శత్రువు చైనా!

భారత్, జపాన్ ఉమ్మడి శత్రువు చైనా!

జపాన్  ప్రధానమంత్రి సనాయ్ తకైచి ఇటీవలే  భారతదేశ  పర్యటనను  ఘనంగా ముగించారు.  భారత్,  జపాన్  మధ్య  సంబంధాలు బలపడుతున్నాయని  చైనాకు సంకేతం ఇవ్వడానికి, భారత్ ఉద్దేశపూర్వకంగా ఆమెకు అసాధారణమైన  ఘన స్వాగతం పలికింది.  చైనా తన పొరుగు దేశాలతో స్నేహం చేస్తుండగా,  చైనా బలమైన ప్రత్యర్థులలో  ఒకటైన  జపాన్‌‌‌‌తో  భారత్  సహకారాన్ని మరింతగా పెంచుకుంటోంది. దీని సందేశం చాలా స్పష్టంగా ఉంది.  

జపాన్,  చైనా నుంచి కేవలం 150 మైళ్ల దూరంలో ఉంది.  భారత్‌‌‌‌కు తన శత్రువును నిలువరించడానికి, వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి జపాన్‌‌‌‌తో  స్నేహం  కలిసొచ్చే అంశం.  భారత్,  జపాన్ కలిసి  తమకు వ్యతిరేకంగా సైనికపరంగా  పనిచేయబోతున్నాయని చైనా  ఇప్పుడు భావిస్తోంది. ఇది మునుపెన్నడూ జరగలేదు. 

జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత 1945 నుంచి  చైనా ఎప్పుడూ  జపాన్‌‌‌‌ను ఆధునిక  సైన్యంలేని  దేశంగానే  పరిగణించింది.  జపాన్  సైనికంగా అభివృద్ధి  చెందకుండా చూస్తూ,  చైనా  దౌత్యపరంగా దానిని బెదిరించింది.  మరోవైపు ఆసక్తికరంగా భారత్  బౌద్ధమతాన్ని, సంస్కృతిని  చైనా, జపాన్, కొరియాలకు ఎగుమతి చేసింది.   

1951లో  చైనా  టిబెట్‌‌‌‌ను  ఆక్రమించినప్పుడే  భారత్‌‌‌‌కు  చైనాతో శత్రుత్వం మొదలైంది.  అప్పటివరకు భారత్‌‌‌‌కు  చైనాతో  సరిహద్దు లేదు.  కానీ  చైనా,  జపాన్‌‌‌‌ల మధ్య అంతులేని యుద్ధాలు జరిగాయి.  ఆ యుద్ధాల్లో ఎప్పుడూ జపనీయులే  గెలిచారు.  చైనా,  జపాన్  పరస్పరం  ఎందుకు  ఒకదానిపై ఒకటి అవిశ్వాసాన్ని పెంచుకున్నాయంటే.. జపాన్ 1931లో  చైనాలోని  కొంత భాగాన్ని ఆక్రమించింది.  1937లో  చైనాపై  పూర్తిస్థాయి దండయాత్రను ప్రారంభించింది.  

జపనీయులు కఠినమైన ఆక్రమణదారులు కావడంతో ఆ యుద్ధం తీవ్రమైన చారిత్రక గాయాలను చైనాకు మిగిల్చింది.  జపనీయులు  చైనీయులను తమకంటే తక్కువవారిగా చూశారు. అయితే  చైనీయులు తమను తాము అందరికంటే గొప్పవారిగా భావిస్తారు. కానీ జపనీయులు ఎల్లప్పుడూ చైనీయులను తమకంటే తక్కువవారిగానే చూశారు.1945లో అమెరికా చేతిలో ఓడిపోయిన తర్వాత, జపాన్ తన వద్ద సాంకేతిక పరిజ్ఞానం,  డబ్బు ఉన్నప్పటికీ  రక్షణ రంగానికి కేటాయింపులు తగ్గించి  వ్యయాన్ని  తగ్గించింది.

  యుద్ధాలలో  భీకరదాడిచేసే ఆయుధాలను అభివృద్ధి చేయలేదు.  కానీ, వాస్తవానికి  జపాన్ ఎల్లప్పుడూ ఒక గొప్ప సైనిక శక్తి కలిగి ఉందనే విషయాన్ని ఎవరూ మరచిపోకూడదు. 1905లో  జపాన్ శక్తిమంతమైన  రష్యన్  నావికాదళాన్ని ఓడించింది. ఆ తర్వాత  మొదటి ప్రపంచ యుద్ధం (1914)లో  జపాన్  బ్రిటన్‌‌‌‌తో  చేతులు కలిపి విజేత పక్షాన నిలిచింది. 

అనంతరం రెండవ ప్రపంచ యుద్ధంలో  జపాన్ అకస్మాత్తుగా  బ్రిటన్, అమెరికాపై దాడి చేసి యుద్ధంలో ఓడిపోయింది.  జపాన్ శాయశక్తులా  యుద్ధంచేసి  దాదాపు అమెరికా,  ఇంగ్లాండ్‌‌‌‌లను  ఓడించినంత  పనిచేసింది.  రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా,  బ్రిటిష్   నౌకలపై తమ విమానాలను కూల్చివేసి  ఆత్మహత్య చేసుకున్న జపనీస్  పైలట్లను అందరూ కలకాలం  గుర్తుంచుకుంటారు. కానీ, 
ఏ చైనీయుడూ అలా చేయలేదు. 

చైనా యుద్ధోన్మాదం

ఇటీవలి కాలంలో  చైనా యుద్ధోన్మాదం పెరగడం, పొరుగు దేశాలను బెదిరించడం జపాన్‌‌‌‌ను కలవర
పెట్టాయి. 2025 నవంబర్‌‌‌‌లో  జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి జపాన్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఒకవేళ చైనా తైవాన్‌‌‌‌పై  దాడి చేస్తే,  జపాన్ కూడా చైనాపై కఠిన సైనిక చర్య తీసుకుంటుందని ప్రకటించారు.  జపాన్  చైనాపై దాడి చేస్తుందన్న వ్యాఖ్యలు గత 80 ఏళ్లలో ఎన్నడూ రాలేదు. 

కానీ జపాన్​ ప్రధాని సనాయ్​ తకైచి వ్యాఖ్యలు  చైనా సైన్యాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రత్యక్షంగా  జపాన్  చైనాకు సంకేతం ఇచ్చినట్టయింది. ఇటీవల కాలంలో ఇప్పటివరకు చైనా ఆయుధాలు కేవలం అమెరికా లేదా భారతదేశాన్ని మాత్రమే ఎదుర్కొన్నాయి. 

చైనా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించింది.   జపాన్ జాతీయవాద నాయకులలో  ప్రధానమంత్రి  సనాయ్ తకైచిని అత్యంత బలమైన ఒకరిగా చైనా  పరిగణిస్తుంది. తన రక్షణ సామర్థ్యాలను వేగంగా విస్తరించుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం,  సంపద జపాన్ వద్ద  ఉన్నాయని  చైనా అర్థం చేసుకుంది.  చైనా  ఇప్పుడు తన  సైన్యాలను  భారతదేశాన్ని ఎదుర్కొనేందుకు మోహరించిన  సముద్ర ప్రాంతం నుంచి తరలించాలని భావిస్తోంది.   

టిబెట్ నుంచి జపాన్‌‌‌‌ను  ఎదుర్కొంటున్న సముద్ర  ప్రాంతానికి చైనా తమ బలగాలను  భారీగా తరలించాల్సి ఉంటుంది.  జపాన్​ రంగప్రవేశంతో  అకస్మాత్తుగా  చైనా సైనిక ప్రణాళికలు నిరుపయోగంగా మారాయి.

భారత్  జపాన్‌‌‌‌కు ఎందుకు దగ్గరవుతోంది

భారత్‌‌‌‌కు, జపాన్‌‌‌‌తో  బలమైన సంబంధాలు అనేక వ్యూహాత్మక లక్ష్యాలను అందిస్తాయి.  చైనా శత్రు
పూరిత ఉద్దేశ్యాలతో  పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక,  మాల్దీవులు వంటి భారతదేశ పొరుగు దేశాలలో తన ప్రభావాన్ని  క్రమంగా విస్తరించింది.  ‘నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు’ అనే  పాత  సామెతను  భారత్  పాటిస్తుంది. 

 అందుకే  శతాబ్దాలుగా  చైనాకు శత్రువుగా ఉన్న జపాన్ ఇప్పుడు  భారత్‌‌‌‌కు వ్యూహాత్మకంగా  సైనిక మిత్రుడు అని ఇది వివరిస్తోంది.   చైనా భారత్‌‌‌‌ను  చుట్టుముట్టగలిగితే  భారత్  కూడా అదేపని  చేయగలదనే సందేశాన్ని జపాన్‌‌‌‌తో మైత్రి  పంపింది. 

దౌత్యపరమైన సంకేతాల ప్రాముఖ్యత

జపాన్  ప్రధానమంత్రి  సనాయ్​ తకైచికి  అసాధారణమైన గౌరవం ఇవ్వడం ద్వారా..  మీరు  మా  పొరుగు శత్రుదేశాలతో  స్నేహం చేసి భారత్‌‌‌‌ను  రెచ్చగొడుతున్నట్లే,  భారత్ ఇప్పుడు మీ అతిపెద్ద శత్రు పొరుగు దేశంతో అత్యంత  స్నేహపూర్వకంగా మారుతోంది. మీ యుద్ధోన్మాదానికి చెక్ పెడుతుంది’ అని భారత్ చైనాకు సందేశం పంపింది.  

జపాన్ ప్రధానమంత్రి సనాయ్  భారత్ విడిచి వెళ్లిన వెంటనే చైనా బహిరంగంగానే చాలా తీవ్రంగా స్పందించింది.  ‘రెండు దేశాల మధ్య స్నేహం మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు’ అని చైనా పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతదేశం  నుంచి  వచ్చిన మౌన సమాధానం ఏమిటంటే.. గత  63 ఏళ్లుగా మీరు పాకిస్తాన్  ఇతర భారత పొరుగు  దేశాలతో  ఏం చేస్తూ వచ్చారో  ఇప్పుడు  భారతదేశం అదే వ్యూహాన్ని అనుసరించి  చైనాకు షాక్ ఇస్తోంది అని తెలియజేస్తోంది. అయితే,  ఒకే ఒక్క  తేడా ఏమిటంటే  జపాన్ అత్యంత సంపన్న దేశం కాగా భారతదేశం చుట్టూ ఉన్న చైనా మిత్రదేశాలు మాత్రం పేదరికంతో కునారిల్లుతున్నాయి. 

చైనాకు ఒక వ్యూహాత్మక సందేశం

భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలలో  తన ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా తరచుగా ప్రయత్నిస్తూ వస్తోంది.  అందువల్ల  భారతదేశం కూడా అదే విధంగా స్పందిస్తూ ముందుకు వెళుతోంది. చైనా  అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక  పోటీదారులలో ఒకటైన  జపాన్ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది.  

ఆసక్తికరంగా  చైనాకు 20 దేశాలు  భూమి,  సముద్ర  సరిహద్దులతో  పొరుగు దేశాలు ఉన్నాయి. ఉత్తర కొరియా మినహా  దాదాపు అన్ని దేశాలతో  చైనాకు వివాదాలు ఉన్నాయి.  చైనాకు రష్యా కూడా కేవలం  తాత్కాలిక మిత్రుడే.  ఉక్రెయిన్‌‌‌‌తో  పోరాడమని  చైనా  రష్యాను  ప్రోత్సహించింది, ఇప్పుడు  రష్యా  ఉక్రెయిన్‌‌‌‌ను ఎదుర్కోవడంలో  ఘోరంగా వైఫల్యం చెందడాన్ని చూస్తూ  లోలోపల ఆనందపడుతోంది.

జపాన్​ చేతిలో నష్టపోయిన చైనా 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్​ ప్రధాని సనాయే తకైచికి ఇచ్చిన ఘన స్వాగతం.. భారతదేశం తన పొరుగు దేశాలతో చైనా శత్రుపూరిత  దౌత్యానికి దీటుగా ప్రతిస్పందిస్తూనే,  జపాన్‌‌‌‌తో  తన భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని  భావించి  జాగ్రత్తగా  రూపొందించిన  ఒక దౌత్య సంకేతం. శతాబ్దాలుగా  జపాన్  చేతిలో చైనా తీవ్రంగా నష్టపోయింది.  

జపాన్ పట్ల  చైనాకు ఒక రకమైన న్యూనతా భావం ఉంది.  జపాన్,  భారతదేశం సైనికపరంగా దగ్గరవ్వడం అనే విషయం  చైనాను  చాలా  ప్రభావితం  చేస్తోంది.  జపాన్‌‌‌‌తో  దాని చేదు జ్ఞాపకాలను  రేకెత్తిస్తోంది.  చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశం సరైన పనే చేస్తోంది. చైనా కూడా  ‘సామ్రాజ్యవాద విస్తరణ’లో  నిమగ్నమై ఉంది, అంటే అది ప్రతిచోటా చాలా ఎక్కువ డబ్బును పెట్టుబడిగా పెడుతూ చాలా దేశాలను  బెదిరిస్తోంది. 

ఈక్రమంలో తమ పరిధిని అతిక్రమించిన  సామ్రాజ్యాలన్నిటిలాగే  చివరికి చైనా కూడా  ఎదురుదెబ్బలు తినే అవకాశం ఉంది.  కానీ, 240 ఏళ్ల క్రితం బ్రిటిష్  ప్రధానమంత్రి లార్డ్ పామర్‌‌‌‌స్టోన్ చెప్పిన మాటను ఈ సందర్భంగా  భారతదేశం గుర్తుంచుకోవాలి.  దేశాలకు శాశ్వత మిత్రులుగానీ,  శత్రువులుగానీ ఉండరు.  
కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. పెంటపాటి పుల్లారావు
పొలిటికల్​ ఎనలిస్ట్

Note:  ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.