మరోసారి రీచార్జ్ షాక్..! భారీగా పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ల ధరలు

మరోసారి రీచార్జ్ షాక్..! భారీగా పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ల ధరలు
  • 15 శాతం దాకా పెరిగే చాన్స్​
  • మార్కెట్లో మిగిలినవి 4 కంపెనీలే
  • కస్టమర్లు పెరగడంతో ఇప్పటికే భారీ ఆదాయం

న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు రీచార్జ్ ​ప్లాన్ల ధరలను పెంచడానికి రెడీ అవుతున్నారు. రాబోయే 3–4 నెలల్లో టారిఫ్ ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్  ఇన్​స్టిట్యూషనల్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. మార్కెట్లో గట్టి పోటీ కారణంగా ప్రస్తుతం ముగ్గురు ప్రైవేట్ ప్లేయర్లు, ప్రభుత్వ ఆపరేటర్ బీఎస్​ఎన్​ఎల్​ మాత్రమే మిగలడంతో ధరల పెంపునకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. 

ఈ రిపోర్ట్ ​ప్రకారం.. జూన్  త్రైమాసికంలో ఒక యూజర్‌‌ నుంచి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌‌పీయూ) త్రైమాసిక ప్రాతిపదికన 1.5 శాతం వరకు పెరగడానికి అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో 2జీ నెట్‌‌వర్క్ నుంచి ఆధునిక 4జీ , 5జీ నెట్‌‌వర్క్‌‌లకు మారడం, కొత్తగా పోస్ట్‌‌పెయిడ్ కస్టమర్ల సంఖ్య పెరగడం,  జూన్​ క్వార్టర్లో ఎక్కువ పని దినాలు ఉండటంతో కంపెనీలకు భారీగా ఆదాయం రానుంది. 

మార్కెట్ పోటీలో వొడాఫోన్ ఐడియా కస్టమర్లను కోల్పోతుండగా,  ఎయిర్‌‌టెల్ ,  జియో ఆ కస్టమర్లను ఆకర్షిస్తూ మార్కెట్ వాటాను నిరంతరం పెంచుకుంటున్నాయి.  రాబోయే రోజుల్లో రిలయన్స్ జియో త్రైమాసిక ప్రాతిపదికన దాదాపు 70 లక్షల మంది కొత్త కస్టమర్లను సాధించవచ్చని అంచనా.  ఎయిర్‌‌టెల్ దాదాపు 50 లక్షల మంది వినియోగదారులను తన నెట్‌‌వర్క్‌‌లోకి చేర్చుకునే అవకాశం ఉంది.  అప్పులతో తిప్పలు పడుతున్న వొడాఫోన్ ఐడియా రెండు లక్షల మంది కస్టమర్లను మాత్రమే సంపాదించవచ్చని అంచనా.

విపరీతంగా నెట్​ వాడకం

దేశవ్యాప్తంగా 4జీ , 5జీ నెట్‌‌వర్క్ విస్తరణ వేగంగా జరుగుతోంది. దీంతో కస్టమర్ల సగటు డేటా వినియోగం వేగంగా పెరుగుతోంది.  జియో, ఎయిర్‌‌టెల్  ఇప్పటికే దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో తమ 5జీ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు ఈ కంపెనీల ప్రధాన దృష్టి తమ నెట్‌‌వర్క్‌‌లలో మరిన్ని 5జీ పరికరాలను చేర్చడంపైనే  ఉంది.  మనదేశంలో 5జీ ఎఫ్‌‌డబ్ల్యూఏ, ఫిక్స్​డ్​  బ్రాడ్‌‌బ్యాండ్ విభాగంలో విస్తరణ ఇంకా తక్కువగానే ఉండటం వల్ల ఈ సేవలకు మార్కెట్లో బలమైన ఆదరణ లభిస్తోంది. 

వొడాఫోన్ ఐడియా కూడా తన 5జీ నెట్‌‌వర్క్‌‌ను వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు దాదాపు 100 నగరాల్లో అందుబాటులో ఉండగా, కంపెనీ తన కవరేజీని మరింత పెంచే పనుల్లో నిమగ్నమైంది. దీనితో పాటు వొడాఫోన్ ఐడియా సంస్థకు పెద్ద ఉపశమనం లభించింది. కేంద్రం నిర్ణయం వల్ల సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల భారం రూ.25 వేల కోట్లకు తగ్గింది.