సిద్దిపేట టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పదేండ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేస్తే, తమ ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల కోట్ల వడ్డీ కడుతోందని జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కలెక్టర్ హైమావతితో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క పెంకుటిల్లు కూడా ఉండొద్దన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. కొత్త పెన్షన్లు త్వరలో ఇస్తామని తెలిపారు. జర్మనీలో 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, యువతకు టాం కామ్ సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి, జర్మనీ లాంగ్వేజ్ నేర్పించి విదేశాలకు ఉచితంగా పంపిస్తామని చెప్పారు. నాయకులు పి హరికృష్ణ, దేవులపల్లి యాదగిరి, గాడిపల్లి శ్రీనివాస్ రెడ్డి, దరిపల్లి చంద్రం పాల్గొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
సిద్దిపేట: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్ లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందజేసి మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల జారీతో పాటు ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో జర్నలిస్టులకు ప్రయారిటీ ఇవ్వాలని కలెక్టర్ కు సూచించారు.
హెల్త్ కార్డులు నెట్వర్క్ ఆసుపత్రుల్లో వినియోగించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంతో పాటు ఇండ్ల నిర్మాణానికి అదనంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్ హైమావతి, డీపీఆర్వో రవికుమార్, లైబ్రరీ చైర్మన్ చంద్రం, నాయకులు పూజల హరికృష్ణ, దేవులపల్లి యాదగిరి, అత్తు ఇమామ్, గోపికృష్ణ, రషీద్ పాల్గొన్నారు.
