హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజుల పాటు కేసీఆర్‌కు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు అందిస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో నీళ్లు ఇచ్చే తెలివి ఉంటే కుంగిన వెంటనే ఎందుకు బాగు చేయలేదని ప్రశ్నించారు.
వారంలో నీళ్లు ఎలా అందిస్తారో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివరించాలని, అప్పుడే నమ్ముతామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కనీసం విచారణకు కూడా ఆదేశించకుండా మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వదిలేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయంటూ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రైతులు విత్తనాలు వేస్తున్నారని, అలాంటప్పుడు పంటలు ఎలా ఎండిపోతాయని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవాలనే దుర్బుద్ధితో కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను ఎలా మెయింటెయిన్ చేయాలో తమ ప్రభుత్వానికి తెలుసని, ఆ విషయంలో బీఆర్‌ఎస్ తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
