టౌన్ ప్లానింగ్ ఏడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..జూలై 10 నుంచి ఆగస్టు17 వరకూ అప్లైకి చాన్స్

టౌన్ ప్లానింగ్ ఏడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..జూలై 10 నుంచి ఆగస్టు17 వరకూ అప్లైకి చాన్స్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 10 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను జనరల్ రిక్రూట్‌‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్టు కమిషన్ కార్యదర్శి హరిత ప్రకటించారు. ఈ పోస్టులకు సంబంధించి ఈ నెల10 నుంచి ఆన్‌‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఆగస్టు 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మల్టీ జోనల్ క్యాడర్ కింద భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారు అర్హులని అధికారులు ప్రకటించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఆర్క్, సివిల్ ఇంజినీరింగ్‌‌లో బీఈ/బీటెక్ , బీప్లానింగ్/బీటెక్  ప్లానింగ్ చేసి ఉండాలి. వీటితో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌‌లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. అలాగే జాగ్రఫీలో ఎంఏ లేదా ఎంఎస్సీ, జియో ఇన్ఫర్మేటిక్స్‌‌లో ఎంఎస్సీ చేసిన వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, సిలబస్, ఇతర పూర్తి వివరాల కోసం కమిషన్ వెబ్‌‌సైట్‌‌ను చూడాలని టీజీపీఎస్సీ సూచించింది.