- రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు
- ఉప్పల్‌లో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ సభ
ఉప్పల్, వెలుగు: అధికారం పోయింది గానీ ప్రజల్లో కేసీఆర్ పట్ల మమకారం తగ్గలేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వర్షాలు లేక కరువుతో రాష్ట్రంలో రైతులు గోసపడుతుంటే నీళ్లియ్యకుండా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై, కేసీఆర్‌పై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మల్లాపూర్‌లో సోమవారం నిర్వహించిన సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ 18వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన చీఫ్‌గెస్ట్‌గా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో వర్షాలు లేకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లక్ష క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నయన్నారు. కన్నెపల్లిలో రెండు పంపులు ఛాల్ జేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల యావత్ తెలంగాణ సుభిక్షమవుతుందన్నారు. నీళ్లిస్తే యూరియా ఇయ్యాలె.. యూరియా ఇస్తే పంట పండుతది.. నీళ్లియ్యకపోతె ఏ లొల్లి లేదని సీఎం పంటలను ఎండబెడుతూ రైతులను తొక్కుతున్నడంటూ ఆరోపించారు.
‘‘నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో.. కానీ మా మీది కోపం రైతుల మీద తియ్యకు’’ అని అన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ‘‘కుండ పలిగితె పలిగింది గానీ కుక్క బుద్ధి తెలిసింది’’ ఎవడు మనోడు.. ఎవడు పగోడు అనేది అర్థమైతున్నదన్నారు. రాష్ట్ర పాలకుడు సద్బుద్ధి కలిగినవాడైతే పేదలు, పెద్దలు, హమాలీలు, మిల్లు యజమానులు అందరూ సంతోషంగా ఉంటారన్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో అదే చూసినమని రైతు బాగున్నడు.. పారిశ్రామికవేత్తలు బాగున్నరని చెప్పారు. హమాలీ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సంక్షేమం కోసం బీఆర్ఎస్ హమాలీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో వెన్నెముకగా నిలుస్తున్న హమాలీ కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. హమాలీ కార్మికులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు.
