మేం పాక్‎లో భాగం కాదు.. మమ్మల్ని ఆదుకోండి: భారత్‌‌ సాయం కోరిన పీఓకే

మేం పాక్‎లో భాగం కాదు.. మమ్మల్ని ఆదుకోండి: భారత్‌‌ సాయం కోరిన పీఓకే

ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత చర్యలు, ఆర్థిక దిగ్బంధనంపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నేత సర్దార్ అమన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు భారతదేశం సహాయం కావాలని, సరిహద్దులను తెరిచి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారితే తాము భారత్‌‌ వైపు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. 

రావలకోట్‌‌లోని ఈద్గా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ‘‘మాకు ఇండియా సహాయం కావాలి. ఇక్కడ రేషన్, ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. మందులు కూడా దొరకడం లేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులపై పాక్ భద్రతా దళాలు విరుచుకుపడుతుండటంతో పీఓకేలో తీవ్ర మానవతా సంక్షోభం నెలకొందని ఆయన పేర్కొన్నారు. 

సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌‌ఓసీ)ను దాటి భారత్ వైపు వెళ్దామా? అని అమన్ ఖాన్ సభకు హాజరైన వేలాది మందిని ప్రశ్నించగా.. ‘‘అవును, సరిహద్దుల వైపు దూసుకెళ్దాం’’ అంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. శాంతియుతంగా హక్కుల కోసం పోరాడుతున్న తమపై పాక్ ప్రభుత్వం బుల్లెట్లతో విరుచుకుపడితే, తమకు వేరే మార్గాలు కూడా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. పూంచ్, దోడా సెక్టార్ల వద్ద ఎల్‌‌ఓసీని తెరవాలని డిమాండ్ చేశారు.

పాకిస్తాన్‌‌కు వ్యతిరేకంగా ‘ఆజాదీ’ నినాదాలు

గత నెల రోజులుగా పీఓకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రారంభంలో కేవలం సబ్సిడీలు, విద్యుత్ బిల్లుల తగ్గింపులాంటి స్థానిక డిమాండ్లతో మొదలైన ఈ ఉద్యమం.. ఇప్పుడు పాక్ నుంచి విముక్తి కోరుకునే స్థాయికి చేరింది. నిరసన ప్రదర్శనల్లో ‘పీఓకే పాకిస్తాన్‌‌లో భాగం కాదు’, ‘మాకు స్వేచ్ఛ కావాలి’ అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. 

కాగా, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. జులై 9 న ఫైనల్ యాక్షన్‌‌ను ప్రారంభిస్తామని పాక్‌‌ సర్కారుకు జేఏఏసీ అల్టిమేటం ఇచ్చింది. తమ నిరసనల్లో భాగం కావాలని పీఓకే ప్రజలు, ప్రవాస కశ్మీరీలకు పిలుపునిచ్చింది. ఆ రోజున పీఓకేలో పర్యటించాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌‌, యూఎన్‌‌వో ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంఘాలను ఆహ్వానించింది. ఆ డెడ్‌‌లైన్ గడువు వరకు క్షమశిక్షణతో వ్యవహరించాలని తన మద్దతుదారులను కోరింది.