నాలా కన్వర్షన్కు లంచం డిమాండ్.. రూ. 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్

నాలా కన్వర్షన్కు లంచం డిమాండ్.. రూ. 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్

చేర్యాల, వెలుగు: నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ సంగారెడ్డి డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని పలు సర్వే నంబర్ల పరిధిలో ఉన్న 30 గుంటల భూమికి సంబంధించి నాలా కన్వర్షన్ కోసం 11 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఎనిమిది అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తి చేసిన తహసీల్దార్ దిలీప్ నాయక్ మిగిలిన దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ. 1.50 లక్షలు డిమాండ్ చేశాడు.

అంత మొత్తం ఇచ్చుకోలేమని బాధితులు చెప్పడంతో రూ. 70 వేలకు ఒప్పందం కుదిరింది. తర్వాత సదరు వ్యక్తులు ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశారు. వారి సూచనలతో సోమవారం స్థానిక ఆఫీస్ లో తహసీల్దార్ ను కలిసి రూ. 70 వేలు ఇచ్చారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌‌ దిలీప్ నాయక్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.