- మళ్లీ బడిబాట పట్టిన 450 మంది విద్యార్థులు
సూర్యాపేట జిల్లా రేగులగడ్డ తండా బడిలో రెండేళ్ల కింద ప్రైమరీ స్కూల్ మూతపడింది. అపట్లో ఆ బడిలోని 9 మంది పిల్లలు ప్రైవేటుకు వెళ్లడంతో మూతపడింది. అధికారుల చొరవతో పేరెంట్స్ ప్రైవేటు మోజు వీడి తమ పిల్లలను సర్కారు బడికే పంపిస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా 20 మంది కొత్తగా చేరారు.
కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం లక్ష్మక్కపల్లిలో 2014లో స్కూల్ మూతపడింది. పదేళ్ల తర్వాత ఈ ఏడాది తెరుచుకోగా, 16 మంది విద్యార్థులు చేరారు. ఇదే మండలంలోని 2021లో మూతపడిన మల్లన్నపల్లి స్కూల్ కూడా మూడేళ్ల తర్వాత ఈ ఏడాది రీఓపెన్ అయింది. ప్రస్తుతం 19 మంది అడ్మిషన్లు పొందారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ బడులకు మెల్లమెల్లగా పూర్వవైభవం వస్తోంది. విద్యార్థులు లేక వెలవెలబోయిన బడుల్లో మళ్లీ సందడి మొదలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 80 ప్రైమరీ స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. వాటిల్లో ఇప్పటివరకు సుమారు 450 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేరెంట్స్‌లో మార్పు రావడం, సర్కారు బడిపై నమ్మకం పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,951 జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లున్నాయి.
వీటిలో అధికారులు, టీచర్ల కృషి, గ్రామస్తుల సహకారంతో ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 20 జిల్లాల్లో 80 బడులు రీఓపెన్ అయ్యాయి. జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లను తిరిగి తెరిపించడంలో నల్గొండ జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 314 జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లు ఉండగా, ఇప్పటివరకు 31 బడులను రీఓపెన్ చేశారు. వాటిలో 64 మంది స్టూడెంట్లు చేరారు. జగిత్యాల జిల్లాలో 12 స్కూళ్లు రీఓపెన్ అవ్వగా, ఏకంగా 169 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 7 బడుల్లో 41 మంది, నిర్మల్ జిల్లాలో 5 స్కూళ్లు ఓపెన్ కాగా 17 మంది, రాజన్న సిరిసిల్లలో 4 స్కూళ్లు తెరుచుకోగా 16 మంది విద్యార్థులు బడి బాట పట్టారు. ఒకరిద్దరు విద్యార్థులు వచ్చిన బడులు తెరుస్తుండటం గమనార్హం. మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 స్కూళ్లు రీఓపెన్ కాగా 28 మంది విద్యార్థులు చేరారు. ఆదిలాబాద్‌లో 2 స్కూళ్లు, కామారెడ్డిలో 2 స్కూళ్లు, మంచిర్యాల, నాగర్ కర్నూల్‌లో 2 స్కూళ్లు తిరిగి తెరుచుకున్నాయి.
- మిగిలిన బడులపై ఫోకస్..
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 1,871 జీరో ఎన్‌రోల్‌మెంట్ బడులున్నాయి. వీటిలో మహబూబాబాద్ (162 స్కూళ్లు), వరంగల్ (134 స్కూళ్లు), సూర్యాపేట (98 స్కూళ్లు), జనగాం (72 స్కూళ్లు) వంటి జిల్లాల్లో ఇంకా ఒక్క స్కూలు కూడా రీఓపెన్ కాలేదు. ఆయా బడుల్లో కూడా కనీసం ఐదారుగురు విద్యార్థులు చేరినా వెంటనే టీచర్లను కేటాయించి, పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది.
సర్కారు బడుల్లో వసతులు మెరుగుపరచడం, ఇంగ్లిష్ మీడియం బోధన అందుబాటులోకి రావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని జీరో స్కూళ్లు కళకళలాడుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
