- డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్ బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్ వద్ద అదుపులోకి తీసుకున్న ఏసీబీ
- హెడ్ క్వార్టర్స్‌కి తరలింపు.. నేడు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్ అయ్యారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని సిటీ న్యూరో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌కు తరలించారు. మంగళవారం ఉదయం ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచనున్నారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలిస్తారు. కాగా, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న భీంరెడ్డిపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. డిశ్చార్జ్ సమ్మరి రాయించుకొని బయటకు వెళ్తున్నట్టు గుర్తించారు. అప్పటికే రిసెప్షన్ వద్ద ఉన్న ఏసీబీ అధికారులు.. బయటకు రాగానే భీంరెడ్డిని అరెస్ట్ చేశారు.
సోదాల సమయంలో హైబీపీ కారణంగా..
డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీంరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇండ్లల్లో ఏసీబీ అధికారులు ఈ నెల 2న సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. కాగా, నార్సింగి వేసెల్లా మెడోస్‌లోని భీంరెడ్డి నివాసంలో సోదాలు చేస్తుండగా.. ఆయనకు హైబీపీ వచ్చింది. దీంతో డాక్టర్ల సూచనల మేరకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే భీంరెడ్డి హెల్త్ హిస్టరీని చెక్ చేశారు. 2021 నుంచి 2023 వరకు మూడేండ్ల వ్యవధిలో కార్డియాక్ వాల్స్‌కు చికిత్స పొందినట్టు గుర్తించారు. ఈ కారణంగా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో భీంరెడ్డి అడ్మిట్ అయ్యారు. ఆయనను అరెస్టు చేయకపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన ఆరోగ్యం కుదటపడేవరకు ఏసీబీ అధికారులు ఎదురుచూశారు. డిశ్చార్జ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
